దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి…. అవి ప్రజలనుండి, నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలను జాగృత పరచి, గ్రామ స్థాయి నుండి ఉద్యమాలను వేళ్లూనుకునేలా దేశం స్తంభించిపోయేలా జరిగాయి. రైల్ రోకో, రాస్తా రోకోలుతో అట్టుడుకుపోయేటట్టు చేశారు. 1974లో రైల్వే సమ్మె “జార్జ్ ఫెర్నాండెజ్” నాయకత్వం లో జరిగిన ఈ సమ్మె దేశంలోనే అతిపెద్దది. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ (JP) నేతృత్వంలో అవినీతి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా “సంపూర్ణ విప్లవ” నినాదంతో దేశవ్యాప్తంగా సాగినది ఈ ఉద్యమం. 1990 లో “మండల్ కమిషన్” వ్యతిరేక మరియు మద్దతు ఉద్యమాలు , 2011లో కేంద్రం బలమైన లోక్‌పాల్ బిల్లును తీసుకురావాలని, అవినీతిని అంతం చేయాలని “ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్” బ్యానర్‌పై అన్నా హజారే నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం. ఇవి ప్రజలనుండి పుట్టినవి. సరైన నాయకత్వం నుండి పుట్టాయి. కాని చప్పున పొంగి చప్పున చల్లారిపోయిన ఈ “కాక్రోచ్ జనతా పార్టీ” చుక్కాని లేని పడవ లా అయ్యింది ప్రస్తుతానికి…. కారణం ఏమిటో విశ్లేషిద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా సమకాలీన రాజకీయ, సామాజిక సమీకరణాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ, “సీబీఎస్‌ఈ” బోర్డు పరీక్షల మూల్యాంకనంలో లోపాలు, మరియు ఇతర జాతీయ నియామక పరీక్షల అవకతవకలపై యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఈ నిరసన వేదికైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి “ధర్మేంద్ర ప్రధాన్” తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సాగిన ఈ ఆందోళన, డిజిటల్ యుగంలో నిరసనల స్వరూపం ఏ విధంగా మారుతోందో స్పష్టం చేసింది.
ఈ ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ఒక సాంప్రదాయ నిరసన కాదు. చీఫ్ జస్టిస్ ఒకానొక సమయంలో, కొంతమందిని ఉద్దేశించి అసహనంతో వ్యాఖ్యానించిన వ్యాఖ్యల ద్వారా, పుట్టుకొచ్చిన పేరు “కాక్రోచ్” (బొద్దింక), అందుకు నిరసనకారులు బొద్దింక పేరుతోనే మాస్కులు ధరించి, చేతుల్లో పూలు పట్టుకుని వినూత్నంగా సాగించిన వ్యంగ్య (Satirical) ధోరణి ఆన్‌లైన్ వేదికలపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. శాంతియుత మార్గంలో వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఈ సరికొత్త శైలి, ముఖ్యంగా ‘జెన్-జీ’ (Gen-Z) యువతను విశేషంగా ఆకర్షించింది. సోషల్ మీడియా టైమ్‌లైన్స్‌పై ఈ సరికొత్త పోరాట రూపం ఒక వెల్లువలా దూసుకుపోయింది.శాంతియుతంగా మార్పు తేవడమే తమ లక్ష్యమని వ్యవస్థాపకుడు “అభిజిత్ డిప్కే” ప్రకటించారు.
అయితే, సోషల్ మీడియా వేదికలపై మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులు సాధించిన ఈ కాక్రోచ్ మూవ్‌మెంట్, ఢిల్లీ వీధుల్లోకి వచ్చేసరికి ఘోరంగా బోల్తా పడింది. ఆన్‌లైన్‌లో కనిపించిన “డిజిటల్ బజ్”, క్షేత్రస్థాయిలో “జనబలం”గా మారలేకపోయింది. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు వందల సంఖ్యలో కూడా గుమిగూడలేకపోవడం ఈ ఉద్యమకారుల అంచనాలను దెబ్బతీసింది. ఇంటర్నెట్ వేదికలపై స్పందించే వర్చువల్ ప్రపంచానికి, వాస్తవ రాజకీయ క్షేత్రంలో ఎండనక వాననక రోడ్లపైకి వచ్చి పోరాడే క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌కు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ పరిణామం స్పష్టం చేసింది.
ఈ ఉద్యమం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణం సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఉండే గ్రాస్ రూట్స్ క్యాడర్ వీరికి లేకపోవడమే. నిరసన వెనుక ఉన్న డిజిటల్ నిపుణులు ఆన్‌లైన్ వ్యూహాలను అద్భుతంగా అమలు చేయగలిగారు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించే యంత్రాంగాన్ని నిర్మించలేకపోయారు. పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. సోషల్ మీడియా కారణం కావచ్చు, డిజిటల్ ఐడెంటిటీలతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కావచ్చు…. దీని మూలంగా సామాన్య ప్రజానీకానికి ఈ ఉద్యమ సందేశం చేరువ కాలేకపోయింది.
మరోవైపు, నిరసనకారులు ఎంచుకున్న “వ్యంగ్య ధోరణి” సైతం క్షేత్రస్థాయిలో ప్రతికూలంగా మారింది. బొద్దింక మాస్కులు వేసుకోవడం, వినూత్న ప్రదర్శనలు చేయడం అంతర్జాతీయ పద్ధతులకు లేదా ఇంటర్నెట్ సంస్కృతికి సరిపోవచ్చు. కానీ, తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆందోళన చెందుతున్న సామాన్య తల్లిదండ్రులు ఈ వ్యంగ్య రూపం లో నిరసించడాన్ని తమ రాజకీయ పోరాటంగా స్వీకరించలేకపోయారు. ఉద్యమ నాయకత్వం మీమ్స్, రీల్స్ చుట్టూ ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో, ఒక తీవ్రమైన సమస్యకు ఉండాల్సిన నిబద్ధత మరియు దాని ప్రభావం క్షేత్రస్థాయిలో లోపించాయి.
ఉద్యమ నాయకత్వ పరిమితులు కూడా దీని వైఫల్యానికి మరో కారణగా నిలిచాయి. లడఖ్ ఆందోళనల ద్వారా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త “సోనమ్ వాంగ్‌చుక్” ఈ ధర్నాకు మద్దతుగా నిలిచారు. నిరసనకారులు ఆయనను ప్రత్యామ్నాయ విద్యాశాఖ మంత్రిగా చేయాలని నినదించినప్పటికీ, తనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని, కేవలం వ్యవస్థాగత మార్పు కోసమే యువత పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడైతే ఒక ఉద్యమం “మేము ఓట్ల రాజకీయం చేయం, కేవలం ఒత్తిడి తెస్తాం” అని చెప్తుందో, అప్పుడు పాలకులకు భయం తగ్గుతుంది. స్పష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపించకపోవడం వల్ల ఇది కేవలం ఒక తాత్కాలిక ప్రదర్శనగానే మిగిలిపోయింది.
ఈ ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఉద్ధవ్ శివసేన (UBT), సీపీఐ (CPI) వంటి ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించినప్పటికీ, అది ఉద్యమానికి కలిసి రాలేదు. నిరసనకారులు తాము “స్వతంత్ర యువజన వేదిక” అని ప్రకటించుకున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీల నీడ పడటంతో అధికార పక్షం దీనిని “రాజకీయ ప్రేరేపిత ధర్నా”గా సులభంగా ముద్ర వేయగలిగింది. దీనివల్ల ఉద్యమానికి ఉండాల్సిన నిష్పాక్షికమైన గుర్తింపు దెబ్బతినడమే కాకుండా, తటస్థంగా ఉండే విద్యార్థులు, మేధావులు ఈ ఆందోళనకు దూరం జరిగారు. “కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనను అణచివేయడానికి లేదా చర్చలు జరపడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసి, నిరసన పరిధి దాటకుండా నియంత్రించడానికే పరిమితమైంది”.
అటు చట్టపరంగా ఢిల్లీ హైకోర్టు కూడా నిరసనకారుల అత్యవసర విచారణ అభ్యర్థనను తృణీకరించింది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదా చర్చల పిలుపు రాకపోవడంతో, పాలకులపై కనీస ఒత్తిడిని కూడా ఈ ధర్నా తీసుక రాలేకపోయిందనేది స్పష్టమవుతోంది.
ప్రభుత్వ మౌనానికి నిరసనగా సీజేపీ ప్రతినిధులు “7 రోజుల” డెడ్‌లైన్ విధించినప్పటికీ, ఆ తర్వాత దానికి కొనసాగింపుగా, దేశవ్యాప్తంగా ఎలాంటి బలమైన కార్యాచరణను ప్రకటించలేకపోయారు. ఒక సుదీర్ఘ పోరాటానికి అవసరమైన ఓపిక, వ్యూహం లేకపోవడంతో ఈ ధర్నా కేవలం ఒక రోజు “ఫోటో షూట్” లేదా “సోషల్ మీడియా స్టంట్”లా ముగిసిపోయింది. ఏడు రోజుల గడువు ముగిసినా క్షేత్రస్థాయిలో ఎటువంటి చలనం లేకపోవడం ఈ ఉద్యమ స్వభావాన్ని బట్టబయలు చేసింది.
ముగింపు: కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా డిజిటల్ మీడియా విశ్లేషకులకు ఒక పెద్ద పాఠం. ఇంటర్నెట్ ద్వారా వచ్చిన సెలబ్రిటీ హోదా వేరు, క్షేత్రస్థాయి ప్రజా నాయకత్వం వేరు అని ఈ పరిణామం నిరూపించింది. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో “ట్రెండ్” అవ్వడం సులభమే కావచ్చు, కానీ వాస్తవ సమాజంలో మార్పు తీసుకురావాలంటే క్షేత్రస్థాయి కేడర్, పటిష్టమైన ప్రజా సంబంధాలు మరియు సుదీర్ఘ పోరాట పటిమ తప్పనిసరి. ఆ పునాది లేనంత కాలం ఎంతటి డిజిటల్ ఉద్యమాలైనా “జంతర్ మంతర్” వీధుల్లో “పాలపొంగు”లా కేవలం ఒక పరిమితమైన ప్రదర్శనలు గానే మిగిలిపోతాయి.