వార్తలు

ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రత, సునామీ హెచ్చరికలు జారీ

Published by
Rahul N

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం శనివారం తెల్లవారుజామున భారీ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం ప్రభావంతో తూర్పు నుసా తెంగారా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

USGS వివరాల ప్రకారం.. భూకంపం దాదాపు గంటన్నర వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. వరుసగా ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం

ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు USGS తెలిపింది. భూకంపం సముద్ర ప్రాంతానికి సమీపంలో సంభవించడంతో భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలకు దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.

నష్టంపై స్పష్టత లేదు

భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలను ఇండోనేషియా ప్రభుత్వం వెల్లడించలేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు.

Rahul N

Recent Posts