వార్తలు

Republic Day: “రిపబ్లిక్ డే” వేడుకలు… జనవరి 26నే ఎందుకు ?

Published by
Suresh Thota

భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో, 1929 డిసెంబర్‌లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో “జవహర్ లాల్ నెహ్రూ” అధ్యక్షతన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు బ్రిటిష్ వారి కింద స్వయం ప్రతిపత్తి కావాలని కోరిన నాయకులు, ఆ రోజున “మాకు పూర్తి స్వాతంత్ర్యం (పూర్ణ స్వరాజ్) కావాలి” అని తీర్మానించారు. ​ఆ తీర్మానం ప్రకారం, 1930 జనవరి26 న మొదటిసారిగా “స్వాతంత్ర్య దినోత్సవం” గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆ రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందుతామని ప్రతిజ్ఞ చేశారు. 1947 వరకు దాదాపు 17 ఏళ్ల పాటు జనవరి 26నే స్వాతంత్ర్య దినోత్సవంగా భావించేవారు.

మనకు ఊహించని విధంగా 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దీనితో ఆగస్టు 15 అధికారిక స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయింది. కానీ, చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నజనవరి 26 తేదీకి గౌరవం ఇవ్వాలని మన నాయకులు భావించారు.

మన రాజ్యాంగం 1949, నవంబర్ 26 నాటికే సిద్ధమైపోయింది. జనవరి 26 తేదీ గుర్తుండిపోయేలా చేయాలని..​రాజ్యాంగాన్ని రెండు నెలలు ఆపి,1950 జనవరి 26 న అమలులోకి తెచ్చారు. ​ఆ రోజు నుండే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కింద కాకుండా, తన సొంత రాజ్యాంగం కలిగిన “గణతంత్ర దేశం”గా (Republic of India) మారింది.

మన జాతీయ జెండా ను తెలుగు వారైన పింగళి వెంకయ్య గారు రూపొందించిన తర్వాత అనేక మార్పులు చెందుతూ వచ్చింది. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ఈ త్రివర్ణ పతాకాన్ని ఆమోదించింది. అప్పుడు పతాకం మధ్యలో ‘రాట్నం’ (చరఖా) ఉండేది. అప్పట్లో స్వదేశీ ఉద్యమానికి, మరియు గాంధీజీ ఆశయాలకు చిహ్నంగా ఉండేది. ​1947లో స్వాతంత్ర్యం రావడానికి కొన్ని రోజుల ముందు (జూలై 22, 1947), రాజ్యాంగ పరిషత్ జెండాలో చిన్న మార్పు చేసింది. జెండాలో రంగులు అవే ఉంచి, మధ్యలో ఉన్న చరఖా స్థానంలో సారనాథ్ లోని అశోక స్తంభం మీద ఉన్న ధర్మ చక్రాన్ని చేర్చారు. ఆ రోజు నుండే ప్రస్తుతం మనం వాడుతున్న జాతీయ జెండా ఖరారైంది.

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

అప్పటికి C. రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ గా పదవీ లో ఉన్నారు. 1950 జనవరి 26న జరిగిన మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల ను ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం)లో నిర్వహించారు. పరేడ్ లో ఉదయం 10:18 గంటలకు చక్రవర్తి రాజగోపాలాచారి భారత్‌ను గణతంత్ర దేశంగా ప్రకటించారు. 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించి…డా. రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరేడ్ లో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా అదే రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు, ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎగురవేస్తే, గణతంత్ర దినోత్సవం నాడు దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. మన రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అది దేశానికి వెన్నెముక వంటిది. మరొక ప్రత్యేకత ఏమిటంటే చేతి వ్రాత తో హిందీ, ఇంగ్లీష్ భాషలలో వ్రాసారు, ఇప్పటికీ ఆ ప్రతులు చాలా భద్రంగా ఉన్నాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం లైబ్రరీ లో వీటిని భద్రపరిచారు. సాధారణంగా కాగితం కాలక్రమేణా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే మన రాజ్యాంగ అసలు ప్రతులను హీలియం గ్యాస్ నింపిన ప్రత్యేకమైన గాజు పెట్టెల్లో ఉంచారు. దీనివల్ల కాగితం పాడవకుండా, అక్షరాలు చెరిగిపోకుండా వందల ఏళ్ల పాటు భద్రంగా ఉంటాయి. దీనిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే వ్యక్తి తన చేతి వ్రాత తో అందగా రాశారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది.

ఆగస్టు 15న దేశ ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు. జనవరి 26 న దేశ రాష్ట్రపతి కర్తవ్య పథ్ (గతంలో రాజ్ పథ్) వద్ద జెండా ఎగురవేస్తారు.

ఎందుకంటే రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగ బద్దమైన అధిపతి. (Head of the State). 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడే రాష్ట్రపతి పదవి ఏర్పడింది. అందుకే ఆ రోజున రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. ​ ప్రధాని దేశ పరిపాలనాధినేత (Head of the Government). 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇంకా రాజ్యాంగం లేదు, రాష్ట్రపతి పదవి లేదు. అప్పట్లో దేశ బాధ్యతలు తీసుకున్నది ప్రధాని కాబట్టి, ఆ రోజున ప్రధాని జెండా ఎగురవేసే సంప్రదాయం మొదలైంది.

ఇద్దరికి జెండా ఎగురవేసే పద్ధతి లో కూడా తేడా ఉంటుంది. ​దీనిని జాగ్రత్తగా గమనిస్తే ఒక చిన్న సాంకేతిక వ్యత్యాసం కనిపిస్తుంది:

ఆగస్టు 15న… జెండా కింది నుండి పైకి తాడుతో లాగి, అక్కడ విచ్చుకునేలా చేస్తారు. దీనిని ‘ధ్వజారోహణం’ అంటారు. అంటే కొత్తగా స్వాతంత్ర్యం వచ్చి, ఒక కొత్త జెండా ఎగిరిందని దీని అర్థం.
​ జనవరి 26 న మాత్రం జెండా అప్పటికే స్తంభం పైభాగాన చుట్టి ఉంటుంది. రాష్ట్రపతి కేవలం తాడు లాగి జెండాను విచ్చుకునేలా (Unfurl) చేస్తారు. అంటే ఇప్పటికే స్వతంత్రంగా ఉన్న దేశం, తన రాజ్యాంగాన్ని అమలు చేసుకుందని దీని అర్థం.

రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి జెండా ఎగురవేస్తారు. జనవరి 26 న గవర్నర్ జెండా ఎగురవేస్తారు.

“మేరా భారత్ మహాన్”

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.