
భారతదేశం ఇంధన అవసరాల కోసం ఇప్పటికీ భారీగా విదేశీ ముడి చమురుపైనే ఆధారపడుతోంది. ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ ముడి చమురు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం మొదలు పెట్టీ, ఆ మిశ్రమ శాతాన్ని క్రమంగా పెంచుతోంది. ఒకప్పుడు 5 శాతం ఉన్న ఇథనాల్ మిశ్రమం ఇప్పుడు 20 శాతం లక్ష్యానికి చేరువవుతోంది. అయితే ఈ విధానం దేశానికి ఆర్థికంగా లాభదాయకమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న అవకాశాలు, సవాళ్లు రెండింటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఇథనాల్ తయారీకి ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, జొన్నలు వంటి పంటలను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో బియ్యం ఆధారిత ఇథనాల్ తయారీ కూడా పెరుగుతోంది. ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉండి మానవ వినియోగానికి అనువుగా లేని లేదా మిగులు నిల్వలుగా ఉన్న బియ్యాన్ని ఇథనాల్ కర్మాగారాలకు కేటాయిస్తున్నారు.
ఈ ఇథనాల్ ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి “బ్రెజిల్, అమెరికా, కెనడా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, చైనా” మరికొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత రంగం మీద వచ్చే వరి ,మొక్కజొన్న, గోధుమలు వంటి వాటి నుండి “ఇథనాల్” తయారుచేసి పెట్రోలు లో ఆ మిశ్రమాన్ని కలుపుతున్నారు. వాటి తగ్గట్టుగానే వాహనాలను తయారు చేస్తున్నారు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇథనాల్ తయారీ సంస్థలకు ప్రభుత్వం బియ్యాన్ని క్వింటాల్‌కు సుమారు ₹2,320 చొప్పున, అంటే కిలోకు దాదాపు ₹23.20 ధరకు అందిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీసుకోని దొడ్డు బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కిలోకు ₹21.60 ధరకు విక్రయించాలని నిర్ణయించింది. అంటే ఇథనాల్ పరిశ్రమకు వెళ్లే బియ్యం ధర, బహిరంగ మార్కెట్ విక్రయ ధర కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వాలకు ఇథనాల్ పరిశ్రమ ఒక ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఎంత ప్రాధాన్యం సంతరించుకుందో తెలియజేస్తోంది. “ఇథనాల్” పరిశ్రమలు కిలోకు ₹23.20 చెల్లించి కొంటున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం తన దొడ్డు బియ్యాన్ని నేరుగా ఇథనాల్ పరిశ్రమకు విక్రయించే అవకాశం ఉందా…? ఉంటే ఎందుకు చేయడం లేదు….? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని ముందుకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం నకు, ఇంకాస్త ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది వేరే సంగతి.
రైతుల కోణంలో చూస్తే “ఇథనాల్” విధానం అనేక అవకాశాలను తెరుస్తోంది. చెరకు రైతులకు మాత్రమే కాకుండా మొక్కజొన్న, జొన్న, బియ్యం పండించే రైతులకు కూడా కొత్త మార్కెట్ ఏర్పడుతోంది. ఒకవేళ ఆహార మార్కెట్‌లో ధరలు తగ్గినా, ఆహార నిల్వలు పాడైపోయినా, ఇథనాల్ పరిశ్రమ ప్రత్యామ్నాయ కొనుగోలుదారుగా నిలిచే అవకాశం ఉంది. రైతుల ఉత్పత్తికి అదనపు డిమాండ్ ఏర్పడటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతం లభించే అవకాశం ఉంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇథనాల్ కార్యక్రమం ఉపయోగకరమే. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం పెరగడం ద్వారా విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కొంత తగ్గుతుంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్య వ్యయం తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా దాని ప్రభావాన్ని కొంత మేర నియంత్రించే అవకాశం మన ప్రభుత్వంనకు ఉంటుంది. ఇంధన భద్రత పరంగా కూడా ఇది ఒక వ్యూహాత్మక అడుగుగా భావించవచ్చు.
అయితే ప్రతి నాణానికి మరోవైపు ఉన్నట్లే, ఇథనాల్ విధానానికీ కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనదారులు తరచూ ప్రస్తావించే అంశం మైలేజ్. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి విలువ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ వాహనాల ఇంధన సామర్థ్యం కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు కొంతమంది నిపుణులు. 20 శాతం ఇథనాల్ మిశ్రమంలో సాధారణంగా 3 నుండి 8 శాతం వరకు మైలేజ్ తగ్గవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పర్యావరణ పరంగా కూడా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఇథనాల్ తయారీ కర్మాగారాల నుంచి వెలువడే ద్రవ వ్యర్థాలు, ముఖ్యంగా “స్పెంట్ వాష్” అనే వ్యర్థ పదార్థం సరైన విధంగా నిర్వహించకపోతే భూగర్భ జలాలు, చెరువులు, నదులు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కర్మాగారాల్లో ఉపయోగించే బాయిలర్ల నుంచి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సూక్ష్మ ధూళి కణాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీని వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు ప్రజలను పట్టి పీడించే అవకాశం ఉంది.
ప్రభుత్వ నియంత్రణలు సక్రమంగా అమలు కాకపోతే స్థానిక పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది అంటున్నారు పర్యావరణ నిపుణులు. దీని వలన, ఇంకా పెద్ద సవాలు నీటి వినియోగం. చెరకు ప్రపంచంలోనే అత్యధిక నీటిని వినియోగించే పంటల్లో ఒకటి. “ఇథనాల్” డిమాండ్ పెరుగుతున్న కొద్దీ చెరకు సాగు విస్తీర్ణం పెరిగితే భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నీటి కొరత సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయలేము.
మరోవైపు “ఆహారమా? ఇంధనమా?” అనే చర్చ కూడా ముందుకు వస్తోంది. బియ్యం, మొక్కజొన్న వంటి ఆహార పంటలను పెద్దఎత్తున “ఇథనాల్” తయారీకి మళ్లిస్తే భవిష్యత్తులో ఆహార భద్రతపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం మిగులు నిల్వలు ఉండటం వల్ల పెద్ద సమస్య కనిపించక పోయినా, కరువు లేదా దిగుబడులు తగ్గిన సంవత్సరాల లో ఈ అంశం ప్రాధాన్యం సంతరించు కోవచ్చు.
అందుకే నిపుణులు ఇప్పుడు ద్వితీయ తరం “ఇథనాల్” వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. వరి గడ్డి, గోధుమ గడ్డి, చెరకు పిప్పి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేయడం ద్వారా ఆహార పంటలపై ఒత్తిడిని తగ్గించవచ్చు. అదే సమయంలో రైతులకు అదనపు ఆదాయ మార్గం కూడా ఏర్పడుతుంది. ఇథనాల్ విధానం దేశానికి అవసరమైనదే. కానీ అది అనుసరించాల్సిన మార్గం ఇది కాదు. “రైతుల ప్రయోజనాలు”, “ఆహార భద్రత”, “నీటి వనరుల పరిరక్షణ”, “పర్యావరణ సమతుల్యత”, ఈ నాలుగు అంశాల మధ్య సమన్వయం సాధించినప్పుడే “ఇథనాల్” నిజమైన అభివృద్ధి సాధనంగా మారుతుంది. లేకపోతే నేటి ఇంధన భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలు రేపటి పర్యావరణ, ఆహార భద్రత సంక్షోభాలకు కారణమయ్యే పెను ప్రమాదం ఉంది.
ముగింపు: “ఇంధన స్వావలంబన లక్ష్యం ఎంత ముఖ్యమో, ఆహార భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని విధాన నిర్ణేతలు మరువకూడదు.”
