Download App

ఐపీఎల్ తెరవెనుక ‘D- కంపెనీ’ నీడలు ‘లలిత్ మోడీ’ సంచలన నిజాలు

జూన్ 8, 2026 • By Suresh Thota
ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా నిలబెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తెరవెనుక ఎంతటి ప్రమాదకరమైన కథలు ఉన్నాయో, ఇటీవలే వెలుగులోకి వచ్చాయి ఆ నిజాలు…. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్‌కు ఇచ్చిన ప్రత్యేక...
ఐపీఎల్ తెరవెనుక 'D- కంపెనీ' నీడలు 'లలిత్ మోడీ' సంచలన నిజాలు

ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా నిలబెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తెరవెనుక ఎంతటి ప్రమాదకరమైన కథలు ఉన్నాయో, ఇటీవలే వెలుగులోకి వచ్చాయి ఆ నిజాలు…. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలను బయటపెట్టారు. క్రికెట్ గ్లామర్ వెనుక దాగి ఉన్న అండర్ వరల్డ్ బెదిరింపులు, రాజకీయ కుట్రలు, వ్యక్తిగత ప్రాణభయాన్ని ఆయన ఈ వేదికపై నిర్మొహమాటంగా పంచుకున్నారు.

ఐపీఎల్ ​క్రికెట్ నుండి తాను శాశ్వతంగా తప్పుకోవడానికి ప్రధాన కారణం అండర్ వరల్డ్ డాన్ “దావూద్ ఇబ్రహీం” (D-Company) నుండి వచ్చిన ప్రాణభయమేనని లలిత్ మోడీ స్పష్టం చేశారు. ఐపీఎల్ ప్రారంభమైన తొలినాళ్లలో (2008 – 2010) మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ద్వారా లీగ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని మాఫియా ముఠాలు తీవ్రంగా ప్రయత్నించాయి. బుకీలను, అనుమానాస్పద వ్యక్తులను స్టేడియంల నుండి వెళ్లగొడుతూ తాను తీసుకున్న కఠిన నిర్ణయాలు అండర్ వరల్డ్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి అని, లండన్ వంటి నగరాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తే వందల మిలియన్ డాలర్లు ఇస్తామని ఆఫర్ చేసినా, తాను లొంగలేదని ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా 2009లో భారత్‌లో సాధారణ ఎన్నికల భద్రత కారణాల దృష్ట్యా ఐపీఎల్ రెండవ సీజన్‌ను అకస్మాత్తుగా సౌత్ ఆఫ్రికాకు తరలించడం మాఫియా సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటికే భారత్‌లోనే మ్యాచ్‌లు జరుగుతాయని అండర్ వరల్డ్ బెట్టింగ్ మార్కెట్ (సట్టా బజార్) వేల కోట్లలో పందాలు కాసింది. ఐపీఎల్ లీగ్ విదేశాలకు మారి విజయవంతం కావడంతో బెట్టింగ్ ముఠాలు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాన్ని నా ద్వారా రికవరీ చేయాలని, లేదా సిండికేట్ కోసం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని దక్కించుకోవాలని దావూద్ ముఠా నాపై ఒత్తిడి తెచ్చింది.

2012లో లండన్‌లోని ఒక మధ్యవర్తి తనను శాటిలైట్ ఫోన్‌లో నేరుగా దావూద్ ఇబ్రహీంతో మాట్లాడించారనే విషయం ఆయన ఈ సందర్భంగా బహిర్గతం చేయడంతో, ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడినట్లయింది. తనను చంపడానికి ముంబై, జోహన్నెస్‌బర్గ్, మాంటెనెగ్రోలలో మూడుసార్లు హత్యాయత్నాలు జరిగాయని లలిత్ మోడీ వివరించారు. ముంబై పోలీసులకు దొరికిన కాల్ రికార్డింగ్స్ ఆధారంగా అప్పట్లో భారత ప్రభుత్వం ఆయనకు ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీని కల్పించాల్సి వచ్చింది. అంతటితో ఆగక లండన్ వీధుల్లో తన కుమారుడిని కిడ్నాప్ చేయడానికి కూడా అండర్ వరల్డ్ ప్రయత్నించిందని ఆయన మొదటిసారిగా బహిర్గతం చేశారు. ​ఈ నిరంతర ప్రాణభయం వల్లే తాను క్రికెట్ ప్రపంచానికి దూరమయ్యానని, ఆ తర్వాతే దావూద్ ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్ “మోడీతో మా సమస్యలు తీరిపోయాయి” అని ప్రకటించాడని ఆయన గుర్తుచేశారు.

అయితే, ఈ ఇంటర్వ్యూ తర్వాత అండర్ వరల్డ్ నుండి ఎలాంటి అధికారిక ఖండన కానీ, స్పందన కానీ రాలేదు. సాధారణంగా మాఫియా ముఠాలు తమ పాత సెటిల్‌మెంట్లపై మీడియా ద్వారా స్పందించడానికి ఇష్టపడవు కాబట్టి, ఈ మౌనం లలిత్ మోడీ వ్యాఖ్యల్లోని వాస్తవికతను బలపరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ​మరోవైపు, కేవలం మాఫియానే కాకుండా అప్పటి రాజకీయ వ్యవస్థ కూడా తనను దేశం విడిచిపోయేలా చేసిందని మోడీ ఆరోపించారు. 2009 లో ఐపీఎల్‌ను సౌత్ ఆఫ్రికాకు తరలించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కీలక మంత్రులు పి. చిదంబరం, లాలూ ప్రసాద్ యాదవ్ తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కావాలనే ఈడీ (ED), ఐటీ (Income Tax) దాడులతో తనపై ఒత్తిడి పెంచి, రాజకీయ కక్షసాధింపుకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రాజకీయ యుద్ధంలో భాగంగానే అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న శశి థరూర్ భార్య సునందా పుష్కర్‌కు కొచ్చి ఫ్రాంచైజీలో ఉచితంగా ఈక్విటీ షేర్లు ఇచ్చారనే నిజాన్ని తానే మొదట ట్విట్టర్‌లో బయటపెట్టానని లలిత్ మోడీ తెలిపారు. ఆ ట్వీట్ సృష్టించిన రాజకీయ సంచలనం వల్లే శశి థరూర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం అప్పటి ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పించి, తన చుట్టూ ఉచ్చు బిగించడానికి కారణమైందని ఆయన తెలిపారు.

బీసీసీఐ (BCCI) వ్యవహారశైలిపై కూడా లలిత్ మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ అనే బ్రాండ్‌ను సృష్టించి, దానిని వేల కోట్ల ఆదాయ వనరుగా మార్చిన పునాది తనదే అయినప్పటికీ, బోర్డు తనను చరిత్ర నుండి తుడిచేయాలని చూస్తోందని ఆరోపించారు. “ఐపీఎల్ అనే బిడ్డకు తండ్రిని నేనే, కానీ ఆ తండ్రిని చంపేసి (Kill the father), ఆ బిడ్డను తామే పెంచుతున్నట్లు బీసీసీఐ నటిస్తోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ​తాను భారతదేశం నుండి పారిపోయిన “ఆర్థిక నేరగాడిని” అనే ప్రచారాన్ని లలిత్ మోడీ పూర్తిగా తోసిపుచ్చారు. బ్రిటన్ ప్రభుత్వం తనకు చట్టబద్ధంగా నివాస హక్కులు కల్పించిందని, తాను లండన్‌లో అందరిలాగే స్వేచ్ఛగా బతుకుతున్నానని చెప్పారు. భారత్‌లో తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున, సరైన రక్షణ లభిస్తుందనే నమ్మకం లేకే తాను లండన్‌లో ఉంటున్నట్లు స్పష్టం చేస్తూ, తనపై ఉన్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు.

చివరగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు కూడా ఆయన తెరదించారు. గతంలో బాలీవుడ్ నటి “సుస్మితా సేన్‌”తో దిగిన ఫోటోలు షేర్ చేయడంపై స్పందిస్తూ, అది కేవలం కొద్దికాలం పాటు సాగిన స్నేహమని, ప్రస్తుతం తామిద్దరం కలిసి లేమని స్పష్టం చేశారు. మొత్తంగా, ఈ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోడీ పంచుకున్న విషయాలు కేవలం తన వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాకుండా… క్రీడలు, రాజకీయం, అండర్ వరల్డ్ ముఠాల మధ్య ఉండే ప్రమాదకరమైన సంబంధాలను దేశం ముందు ఉంచింది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading