Download App

USA గ్రీన్ కార్డ్ నిబంధనలు… భారత టెకీలకు బంధనాలు…

మే 25, 2026 By Suresh Thota
అమెరికా అంటేనే కలలు ప్రపంచం, అందరూ అక్కడ ఆర్థిక అవకాశాలను, అంది పుచ్చుకోవడానికి ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా దశాబ్దాలుగా అక్కడ లీగల్‌గా నివసిస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు మరియు విద్యార్థులకు యూఎస్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా, "యూఎస్ సిటిజన్‌షిప్...
USA గ్రీన్ కార్డ్ నిబంధనలు… భారత టెకీలకు బంధనాలు…

అమెరికా అంటేనే కలలు ప్రపంచం, అందరూ అక్కడ ఆర్థిక అవకాశాలను, అంది పుచ్చుకోవడానికి ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా దశాబ్దాలుగా అక్కడ లీగల్‌గా నివసిస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు మరియు విద్యార్థులకు యూఎస్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా, “యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్” (USCIS) ఒక సంచలనమైన నిబంధనలు విడుదల చేసింది.

అమెరికాలో తాత్కాలిక లేదా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఉన్న విదేశీయులు “గ్రీన్ కార్డ్” (శాశ్వత నివాస హక్కు) కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సాధారణంగా అమెరికాలోనే ఉండే అవకాశం ఉండదు. ఇప్పటివరకు ఉన్న “అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్” (AOS) లో లూప్‌హోల్స్‌కు ముగింపు పలుకుతూ, దరఖాస్తుదారులు ఖచ్చితంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లి, అక్కడి అమెరికన్ కాన్సులేట్ ద్వారానే “కాన్సులర్ ప్రాసెసింగ్” పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది.
​అమెరికా ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు అక్కడ లభించే అత్యంత కీలకమైన అస్త్రాలు OPT (Optional Practical Training) మరియు STEM OPT. విద్యార్థి వీసా (F-1) పై చదువు పూర్తయిన తర్వాత, తాము చదివిన రంగానికి సంబంధించిన ఉద్యోగం చేసుకుంటూ ప్రాక్టికల్ అనుభవం సంపాదించడానికి యూఎస్ ప్రభుత్వం ఇచ్చే లీగల్ వర్క్ పర్మిట్లు ఇవి.

సాధారణంగా ఏ కోర్సు చదివిన విద్యార్థికైనా 12 నెలల (1 సంవత్సరం) OPT లభిస్తుంది. అయితే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చదివిన వారికి లభించే STEM OPT ద్వారా అదనంగా మరో 24 నెలల పొడిగింపు దక్కుతుంది. అంటే, ఒక భారతీయ STEM విద్యార్థి ఎలాంటి అదనపు వర్క్ వీసా లేకుండా మొత్తం 36 నెలలు (3 సంవత్సరాలు) అమెరికాలో లీగల్‌గా ఉద్యోగం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది.

అమెరికాలో విద్యార్థి దశ దాటిన తర్వాత అక్కడే స్థిరపడాలంటే అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం H-1B వర్క్ వీసా. సాధారణ OPT ఉన్న విద్యార్థులకు ఈ వీసా దక్కించుకోవడానికి ఏడాదికి ఒకే ఒక అవకాశం ఉండగా, STEM OPT ఉన్నవారికి ఆ మూడు సంవత్సరాల కాలంలో మొత్తం మూడు సార్లు H-1B లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వీలుంటుంది. అందుకే భారతదేశం నుండి అమెరికా వెళ్లే విద్యార్థులలో దాదాపు 80 శాతం మంది STEM కోర్సులనే ఎంచుకుంటారు. ఈ వర్క్ వీసా లభించిన తర్వాతే కంపెనీలు సదరు ఉద్యోగికి గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం స్పాన్సర్ చేయడం ప్రారంభిస్తాయి. అయితే, ఇక్కడే సరికొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమెరికాలోని భారతీయుల పాలిట శాపంగా మారబోతున్నాయి.

​కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, చట్టంలోని సెక్షన్ 245(a)ను ప్రభుత్వం కఠినంగా వ్యాఖ్యానించింది. అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ ఐ-485 (I-485) ఫామ్ ద్వారా స్టేటస్ మార్చుకోవడం (AOS) అనేది ఇకపై “అత్యంత ప్రత్యేక పరిస్థితి లో మాత్రమే ఇచ్చే అవకాశం” (Extraordinary Relief) గా మార్చారు. అంటే H-1B ఉద్యోగులు కానీ, F-1 విద్యార్థులు కానీ “గ్రీన్ కార్డ్” ప్రాసెస్ కోసం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూల నిమిత్తం తప్పనిసరిగా భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. తాత్కాలిక అవసరాల కోసం అమెరికా వచ్చి, దానినే గ్రీన్ కార్డ్ పొందడానికి షార్ట్‌కట్‌గా మార్చుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS తెలిపింది.

ఈ నిబంధనల మార్పుపై USCIS అధికారిక ప్రతినిధి “జాక్ కాహ్లెర్” ప్రభుత్వ ఉద్దేశాన్ని, ఆయన మాటల్లో… ​”మేము ఇమ్మిగ్రేషన్ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని తిరిగి కఠినంగా అమలు చేస్తున్నాం. తాత్కాలికంగా అమెరికాలో ఉన్నవారు గ్రీన్ కార్డ్ కోరుకుంటే, ప్రత్యేక పరిస్థితులు తప్ప సాధారణంగా తమ స్వదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అమెరికాకు తాత్కాలిక వీసాలపై వచ్చిన వారు చదువు, ఉద్యోగం, పర్యటన వంటి నిర్దిష్ట అవసరాల కోసమే రావాలి. అంతే తప్ప, అదే గ్రీన్ కార్డ్ ప్రక్రియకు మొదటి అడుగుగా మారకూడదు. ఈ విధానం వల్ల ఎక్కువ శాతం గ్రీన్ కార్డ్ కేసులు విదేశాల్లోని కాన్సులేట్‌ల ద్వారా ప్రాసెస్ అవుతాయి. దీనివల్ల లోపల ఉన్న USCIS తన వనరులను పౌరసత్వ దరఖాస్తులు, మానవ అక్రమ రవాణా బాధితుల వీసాలు, హింసాత్మక నేరాల బాధితులకు రక్షణ వీసాలు అందించడం వంటి ఇతర కీలక సేవలపై కేంద్రీకరించగలదు.” అని స్పష్టం చేశారు.

అయితే, ఈ కొత్త రూల్ తెచ్చిన ప్రకంపనల నేపథ్యంలో…. అమెరికాలో భారతీయుల స్థిరపడటం పై సమాజంలో ఉన్న కొన్ని అపోహలు, వాటి వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా అమెరికాలో ఇల్లు కొనుక్కుని, పిల్లలను స్కూళ్లలో చదివిస్తూ ఉన్నారంటే వారు అక్కడ “గ్రీన్ కార్డ్” సాధించి పూర్తిగా ‘స్థిరపడ్డారు’ అని చాలా మంది భావిస్తారు. కానీ అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం అది పూర్తిగా తప్పు. అమెరికాలో ఇల్లు కొనడానికి లేదా పిల్లలను చదివించడానికి “గ్రీన్ కార్డ్” ఉండాల్సిన అవసరం లేదు. కేవలం తాత్కాలిక వర్క్ వీసా (H-1B) పై ఉన్నవారు కూడా అక్కడ ఇళ్లు కొనవచ్చు. భారతీయులకు “గ్రీన్ కార్డ్” రావడానికి ప్రస్తుతం దశాబ్దాల కాలం పడుతుండటంతో, వారు H-1B వీసాలను మూడేళ్లకు ఒకసారి పొడిగించుకుంటూ, తాత్కాలికం గానే అక్కడ కాలం గడుపుతుంటారు.

ఈ క్రమంలోనే మరో ముఖ్యమైన అంశం…. అమెరికాలో పుట్టే పిల్లల పౌరసత్వం. అమెరికా రాజ్యాంగంలోని ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ (Birthright Citizenship) నియమం ప్రకారం ఆ దేశ సరిహద్దుల్లో పుట్టిన ఏ బిడ్డకైనా పుట్టుకతోనే నేరుగా “అమెరికా పౌరసత్వం” (US Citizenship) లభిస్తుంది. అయితే, ఇక్కడే ఒక పెద్ద చట్టపరమైన చిక్కు ఉంది. పిల్లవాడు అమెరికా పౌరుడైనంత మాత్రాన, అతని తల్లిదండ్రులకు ఆటోమేటిక్‌గా ఎలాంటి “గ్రీన్ కార్డ్” లేదా “పౌరసత్వ” హోదా లభించవు. తల్లిదండ్రులు తమ స్వంత వర్క్ వీసా (H-1B) లేదా ఇతర లీగల్ హోదాపైనే అమెరికాలో కొనసాగాల్సి ఉంటుంది.

​అమెరికా పౌరుడైన ఆ బిడ్డ ద్వారా తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ రావాలి అంటే, ఆ బాబు లేదా పాపకు 21 సంవత్సరాలు నిండాల్సి ఉంటుంది. 21 ఏళ్లు వచ్చిన తర్వాతే ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసే అర్హతను (Immediate Relative Category ) పొందుతారు. అంతవరకు తల్లిదండ్రులు తమ సొంత వీసాలపైనే ఆధారపడాలి. ఒకవేళ ఈ లోపు తండ్రి లేదా తల్లి ఉద్యోగం కోల్పోయి, వారి H-1B వీసా గడువు ముగిసిపోతే, అమెరికా పౌరుడైన తమ చిన్న పిల్లవాడిని తీసుకుని వారు భారతదేశానికి తిరిగి వచ్చేయాల్సిందే తప్ప అక్కడ ఉండటానికి చట్టం అంగీకరించదు.

అందుకే అమెరికాలో పుట్టిన పిల్లలు (యూఎస్ సిటిజన్స్) ఉన్నప్పటికీ, వారి తల్లిదండ్రులు ఇంకా H-1B వీసాపైనే ఉంటూ “గ్రీన్ కార్డ్” ప్రాసెస్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ వల్ల, ఈ తల్లిదండ్రులు “గ్రీన్ కార్డ్” ఇంటర్వ్యూ కోసం ఇండియాకు రావలసి వస్తే, అమెరికా పౌరులైన వారి చిన్న పిల్లలను కూడా ఇక్కడికి తీసుకురావాల్సి రావడం లేదా అక్కడ ఒంటరిగా వదిలేసి రావడం వంటి కష్ట తరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే భారతదేశానికి ప్రయాణమవ్వడం, ఇక్కడ వీసా ప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు వేచి ఉండటం అనేది తీవ్రమైన ఆర్థిక భారంతో మరియు ఉద్యోగ అనిశ్చితితో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది.

​ప్రస్తుతానికి USCIS ఈ మార్పులను ప్రకటించినప్పటికీ, H-1B మరియు L-1 వంటి వీసాలకు చట్టబద్ధంగానే ‘డ్యూయల్ ఇంటెంట్’ (తాత్కాలికంగా ఉంటూనే పౌరసత్వానికి ప్రయత్నించే హక్కు) ఉన్నందున, అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి కోర్టుల్లో పెద్ద ఎత్తున న్యాయపోరాటం జరిగే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో “అత్యంత ప్రత్యేక పరిస్థితులు” అంటే ఏమిటి…? అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న “ఐటీ నిపుణుల”కు ఏమైనా మినహాయింపులు ఇస్తారా….? అనే అంశాలపై మరింత స్పష్టత వస్తేనే లక్షలాది మంది భారతీయ కుటుంబాల భవితవ్యం తేలనుంది.

ముగింపు: ఇంతకు ముందు లా, అమెరికా లోని ఆర్థిక వ్యవస్థ , పరిస్థితితులు లేవు అంటున్నారు… ఆర్థిక నిపుణులు. రోజు రోజుకు అమెరికా కి పెరుగుతున్న ఆర్థిక వ్యయం, అప్పులు, అక్కడ యువత కు సరైన ఉపాధి కల్పించ లేకపోవడం. రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు రక్షణ పరికరాలను తక్కువ ధరకు ఎగుమతి చేసే స్థాయి కి రావడం. ఇంకా యుద్ధాలు, ఆయిల్ రంగం లో అనిశ్చితి వగైరా కారణాల మూలంగా ఒడిదుకులకు లోనవుతుంది. దీని మూలంగా అక్కడ ఉన్న భారతీయుల ఆలోచన సరళి మారుతుంది అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి .

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading