ఓటిటి న్యూస్

OTTలోకి వస్తున్న రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ ‘లెనిన్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Published by
Srinivas

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. జూలైలో విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, కమర్షియల్‌గా సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఓటీటీ విడుదలను ప్రకటిస్తూ జీ5 ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత నాగార్జున మాట్లాడుతూ, “ఆగస్టు నా బర్త్‌డే మంత్. థియేటర్లలో ‘లెనిన్’కు మీరు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆగస్టు 7 నుంచి ఈ సినిమా మీ ఇంటికే వస్తోంది. కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి” అని తెలిపారు.

‘లెనిన్’ కథ ఇదే

1990ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో కథ సాగుతుంది. ప్రతి ఏడాది జరిగే ద్రౌపదమ్మ జాతర ఆ గ్రామానికి ఎంతో ప్రత్యేకం. జాతర జరిగే 18 రోజుల పాటు రక్తపాతం జరగకూడదనేది అక్కడి సంప్రదాయం.

అలాంటి గ్రామానికి అనాథగా వచ్చిన లెనిన్ను ఓ కుటుంబం చేరదీస్తుంది. అక్కడే అతనికి స్నేహం, ప్రేమ, కుటుంబం దొరుకుతాయి. కానీ అనుకోని సంఘటనలతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విడుదలైన తర్వాత అతను ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాల చుట్టూ సినిమా సాగుతుంది.

సినిమా బలాలు

ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని తన కెరీర్‌లోనే అత్యంత మాస్, రస్టిక్ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. భాగ్యశ్రీ బోర్సె నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు ఎమోషన్స్, యాక్షన్‌ను సమతూకంగా మేళవించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది.

అలాగే ఎస్. థమన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవగా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ చిత్రాన్ని మరింత ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దాయి.

థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ‘లెనిన్’ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఆగస్టు 7 నుంచి జీ5లో ఈ సినిమాను వీక్షించవచ్చు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts