ఏనుగుల దారిలో ఏఐ టెక్నాలజీ

Published by
Srinivas

మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల కోన శివాలయానికి వెళ్ళిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం పాలవడం బాధాకరమని, ఇటువంటి దుర్ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, అధికారులను ఆదేశించారు.

మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్ళేవారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, పోలీసు, దేవాదాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కోడూరు అటవీ రేంజిలోని గుండాల కోన దగ్గర ఏనుగులు తొక్కేయడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియచేశారు.

ఈ సందర్భంగా అటవీ, వన్యప్రాణి సంరక్షణ అధికారులతో పలు అంశాలపై చర్చించారు పవన్ కల్యాణ్. ఏనుగులు సంచరించే ప్రాంతాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాలన్నారు. కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారనీ, అదే విధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను, విధానాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు.

ఏనుగుల కదలికలు ఉన్న ప్రాంతాలలో రైల్వే లైన్ బారికేడింగ్ చేయాలన్నారు. ఏనుగుల కదలికను ట్రాక్ చేయడానికి రేడియో కాలరింగ్‌, ఇతర అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక నివాసితులతోపాటు, అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్ళే యాత్రికులకు ఏనుగుల ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత చర్యల గురించి అవగాహన కల్పించేదుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. 

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.