ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

Published by
Srinivas

ప్రారంభం నుంచి క్రమశిక్షణకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఏం జరిగినా అంతర్గతంగానే జరుగుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీలోలాగ మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసుకోరు. ఈ విషయంలో చంద్రబాబు చాలా కఠినంగా ఉంటారు. అందుకే టీడీపీని క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మరోసారి అది రుజువైంది.

ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ, ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఫైబర్ నెట్ ఛైర్మన్, టీడీపీ నేత జీవీ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛైర్మన్ గా వచ్చిన జీవీ రెడ్డి పలు సంస్కరణలు ప్రతిపాదించారు. అవేవీ అమలు కాలేదు. సంస్థకు ఆదాయం పెరగలేదు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు.

వీటిపై జీవీ రెడ్డి భగ్గుమన్నారు. తను ఎంత కష్టపడుతున్నప్పటికీ దినేశ్ కుమార్ సహకరించడం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనితీరు ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన 410 మందిని తొలగించాలని డిసెంబరులోనే జీవీ రెడ్డి నిర్ణయించినా, వారిలో ఒక్కరినీ దినేష్ కుమార్ తొలగించలేదు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండానే కోటిన్నర జీతాలు చెల్లిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు.

ఇలా బహిరంగంగా విమర్శలు చేయడంతో చంద్రబాబు, ఇద్దర్నీ పిలిపించి మందలించారు. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి లేదా మంత్రితో మాట్లాడాలన్నారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపటికే జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు ముఖ్యమంత్రి. అదే సమయంలో ఎండీ దినేష్ కుమార్ ను కూడా ఆయన పొజిషన్ నుంచి బదిలీ చేశారు. ఇలా పూర్తిస్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.