ఆంధ్ర ప్రదేశ్

రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఏర్పాట్లలో పవన్ కళ్యాణ్

Published by
Suresh Thota

“వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి”

రాజమహేంద్రవరం గురించి అక్కడ పారే అఖండ గోదావరి గురించి అద్భుతంగా వర్ణించిన చిత్రం. “ఆంధ్రకేసరి” (1983) ఈ చిత్రం లో, గీతరచయిత “ఆరుద్ర” కలం నుండి జాలు వారిన సువర్ణాక్షరాలకు ప్రతి రూపం …. ఈ గీతం. సంగీతం దర్శకుడు “సత్యం” ఈ పాటకు సంగీతం అందించగా, అమర గాయకుడు “బాలు” ఈ పాటకు ప్రాణం పోశారు.

ప్రతి గోదావరి పుష్కరాలకి రాజమహేంద్రవరం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అంతటి ప్రతిష్టాత్మకమైన చోట ఏర్పాట్లను పర్యవేక్షించడానికి, ఉప ముఖ్యమంత్రి”పవన్ కళ్యాణ్” స్వయంగా నగరమంతా తిరుగుతూ పర్యటిస్తున్నారు. గోదావరి తీరాన నవ శకానికి నాంది పలకబోతున్నారు.

నదులు కేవలం నీటి వనరులు కావు.. దేశ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు జీవనాడులు. ముఖ్యంగా దక్షిణ గంగగా పిలవబడే గోదావరి జీవనదికి జరిగే పుష్కరాలు కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీకలు. రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే శంఖారావం పూరించింది. ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” రాజమహేంద్రవరం వేదికగా క్షేత్రస్థాయి పరిశీలనకు దిగడం, ముందస్తు సమీక్షలు నిర్వహించడం రాబోయే “మహా పుష్కరాల” దిశగా ప్రభుత్వం ఎంత పకడ్బందీగా అడుగులు వేస్తోందో స్పష్టం అవుతుంది.

ఇటీవల సర్జరీ పూర్తి చేసుకుని కోలుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” తన తొలి అధికారిక పర్యటనకు “రాజమహేంద్రవరం” గోదావరి తీరాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం పరిపాలనాపరమైన బాధ్యత మాత్రమే కాదు, అంతకుమించిన స్పష్టమైన దార్శనికత కనిపిస్తోంది.

ఉత్తరాదిలో జరిగే కుంభమేళా ఏ స్థాయిలో దేశ, విదేశీ పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుందో…. అలాగే రాబోయే గోదావరి పుష్కరాలను, “రాజమహేంద్రవరం” లో కూడా అదే స్థాయి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవంతో నిర్వహించాలని ప్రభుత్వ సంకల్పం లా కనపడుతుంది. ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” “పుష్కర్ ఘాట్” నుండి “కోటిలింగాల రేవు” వరకు స్వయంగా బోటులో ప్రయాణించి ఘాట్ల స్థితిగతులను పరిశీలించడం ద్వారా లోపాలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కాలుష్య రహిత పుష్కరాలు…

గత పుష్కరాల అనుభవాల దృష్ట్యా పరిశీలిస్తే, భక్తుల రద్దీ పెరిగినప్పుడు ఘాట్ల వద్ద పారిశుధ్యం, నదిలో నీటి నాణ్యత క్షీణించడం వంటి సమస్య లతో ప్రభుత్వ యంత్రాంగం కి పెను సవాలుగా ఉండేది. అయితే ఈసారి ప్రభుత్వం “కాలుష్య నివారణ” ను ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం ముదావహం. నగరం లోని డ్రైనేజీ నీరు, వ్యర్థాలు నేరుగా గోదావరి పవిత్ర జలాల్లో కలవకుండా ముందస్తుగానే శాశ్వత మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (STPs) బలోపేతం చేయాలని “పవన్ కళ్యాణ్” ఆదేశించడం ఆయనకు ఉన్న పర్యావరణ స్పృహకు నిదర్శనం. భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కేవలం ఘాట్లు నిర్మించడమే కాదు, ఆ జలాలు ఆరోగ్యకరంగా, స్వచ్ఛంగా ఉండేలా చూడటం అత్యంత కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు.

​టూరిజం పోలీస్ వ్యవస్థ తో… భద్రత, ఉపాధి

కోట్లాది మంది తరలివచ్చే ఇలాంటి వేడుకల్లో శాంతిభద్రతల పరిరక్షణ అనేది చాలా , చాలా ముఖ్యం. ప్రభుత్వానికి అతిపెద్ద టాస్క్ కూడా, దీనికోసం ప్రత్యేకంగా “టూరిజం పోలీస్” (పర్యాటక పోలీస్) వ్యవస్థను ప్రతిపాదించడం ఒక వినూత్న ప్రయోగం. దేవాదాయ, అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్ శాఖలను సమన్వయం చేయడం ద్వారా భక్తులకు మెరుగైన సేవలందుతాయి. ​ఈ భారీ నెట్‌వర్క్ ద్వారా సుమారు 50 వేల మంది స్థానిక యువతకు తాత్కాలిక మరియు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రభుత్వ సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది.

​సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పుష్కరాల పనులను, కొన్ని నెలల ముందు మాత్రమే ప్రారంభిస్తుంటుంది. ఫలితంగా నిధుల దుర్వినియోగం, నాణ్యతా లోపాలు, ఆఖరి నిమిషం హడావుడి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ, కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర ముందే, మే నెల ఎండలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయి సమీక్షలకు శ్రీకారం చుట్టడం ఒక సానుకూల పరిణామం.

​”చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు” గా కాకుండా, “ముందు జాగ్రత్త నే ముమ్మాటికీ మేలు” అనే చందాన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సర్వదా ప్రశంసనీయం. ​అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఇదే సమన్వయంతో, అవినీతికి తావులేకుండా పనులను శరవేగంగా పూర్తి చేస్తే… రాబోయే గోదావరి పుష్కరాలు, రాజమహేంద్రవరం గురించినే కాక, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో మైలురాయిగా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముగింపు: నాయకుడు నిజాయితీ తో నడుం బిగిస్తే, ఎంత పెద్ద పని అయినా, వాళ్ళ కృషి, పట్టుదలతో చిన్నవి అయిపోతాయి అనడానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన తో ఋజువు అవుతుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.