ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆనందం నింపింది. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, ఒక మహిళ ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పాలనపై అభిప్రాయం అడగగా, ఆ మహిళ “సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పాలన చాలా బాగుంది” అని సంతోషం వ్యక్తం చేసారు.
ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 8,458 పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
మహిళా సాధికారతపై తన కట్టుబాటును సీఎం మరోసారి వ్యక్తం చేస్తూ, డ్వాక్రా, మెప్మా సంఘాల ఏర్పాటు, అలాగే మహిళలను ఆర్టీసీ కండక్టర్లుగా నియమించిన మొదటి ప్రభుత్వం తెలుగుదేశమేనని గుర్తు చేశారు. త్వరలోనే మహిళలు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ పథకం ద్వారా సుమారు 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. “మహిళలు సాధికారత సాధించే వరకు అండగా ఉంటాం. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.