ఆంధ్ర ప్రదేశ్

నేనూ బటన్ నొక్కొచ్చు, కానీ ఆ పని చేయను: చంద్రబాబు

Published by
Srinivas

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ సాగించిన బటన్ పాలనను తను కొనసాగించనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకర్షించాయి.

“నేను కూడా బటన్ నొక్కొచ్చు. కానీ మీ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చాను. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయాన్ని పెంచాలి. జీవన ప్రమాణాలు పెంచాలి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవు.”

శ్రీకాకుళం పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందని, శ్రీకాకుళంలో ప్రజల సమస్యలు, పేదల కష్టాలు చూశానని, ఆ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చానని ప్రకటించారు చంద్రబాబు.

“మత్స్యకారుల సేవలో” పేరుతో మత్స్యకారులకు ఆర్థిక సాయం పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.