ఆంధ్రప్రదేశ్ అంతా నిన్న ఒక్కటే మాట… భారత్ విజయం సాదించాలి !
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది.
ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, యువజన సంఘాలు కలిసి అనేక ప్రాంతాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం వీక్షించే అవకాశం కల్పించారు. పెద్ద ఎత్తున అభిమానులు కుటుంబాలతో, స్నేహితులతో తరలి వచ్చి క్రికెట్ ఉత్సాహంలో మునిగిపోయారు.
ఫైనల్ మ్యాచ్‌లో ప్రతి బంతికి, ప్రతి రన్‌కి జనంలో ఉత్కంఠ తారాస్థాయిలో కనిపించింది. భారత్ బౌండరీ కొట్టిన ప్రతీసారి చప్పట్లు, కేరింతలతో ఆకాశం మార్మోగిపోయింది. యువత మాత్రమే కాదు, పెద్దవారు, మహిళలు, చిన్నారులు కూడా ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా కూర్చున్నారు.
“మా అమ్మాయిలే గెలవాలి… దేశాన్ని గర్వంగా నిలబెట్టాలి!” అంటూ అభిమానులు గళం కలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలలో, ఇళ్లలో, కార్యాలయాలలో కూడా భారత విజయం కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసారు. కొందరు యువతులు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించి జట్టు విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ… “ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువస్తాయి. ముఖ్యంగా మహిళల క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా సమాజంలో స్ఫూర్తి పెరుగుతుంది” అన్నారు.
ప్రజా స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, సమాజంలో ఐక్యత, ఆనందం, ఉత్సాహం నింపుతున్నాయి.
ఇక ఫైనల్ ఫలితంతో, భారత మహిళల కృషి ఇప్పటికే కోట్లాది మనసులను గెలుచుకుంది.