ఆంధ్ర ప్రదేశ్

శ్రీ వేంకటేశ్వరునికి… ఇదా మీరిచ్చే గౌరవం…

Published by
Suresh Thota

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆశ్చర్యానికి గురువుతుండవచ్చు… శాసన మండలిలో జరుగుతున్న నాటకీయ పరిణామాలను చూసి… అవును… నిజమే…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతభావోద్వేగాలు, సభా మర్యాదలపై తీవ్ర చర్చకు దారితీసిన సంఘటన శాసన మండలిలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 19–20, 2026 తేదీల్లో జరిగిన సమావేశాల్లో వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీలు తమ నిరసనగ తెలుపుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను చెప్పులు, బూట్లు వేసుకుని ప్రదర్శించడం పెద్ద వివాదానికి కారణమైంది.

ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి లో జరిగినందున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. వైసీపీ సభ్యులు తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలు, ఇందాపూర్ డెయిరీల అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ సభలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్రదర్శించారు. అయితే సభ్యులు చెప్పులు, షూస్ తొలగించకుండా ఫోటోలు పట్టుకోవడం తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది.

ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కాగా ఈ అంశం పై టీడీపీ, బీజేపీ నేతలు శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఈ అంశం పై పలువురు నేతలు ఈ చర్యను హిందూ భావోద్వేగాలకు అవమానంగా అభివర్ణించారు.

మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ…. “కలియుగ ప్రత్యక్ష దైవం చిత్రపటాలను చెప్పులతో పట్టుకోవడం మహాపరాధం. ఇది చాలా అభ్యంతరకరమైన చర్య” అన్నారు.

బీజేపీ ఎమ్మెల్సీ “సోము వీర్రాజు” మాట్లాడుతూ… షూస్‌ ధరించి దేవుని చిత్రపటాలు పట్టుకుని సభలోకి రావడం క్షమించరాని నేరంగా… హిందూ సెంటిమెంట్స్‌కు అవమానించే చర్యగా అభివర్ణించారు. హిందూ సంఘాలు, ఈ చర్య కు బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఇది ఇలా ఉండగా, వైసీపీ వర్గాలు మాత్రం అవమానకరంగా తాము ప్రవర్తించలేదని, తమకు ఆ ఉద్దేశం లేదని చెబుతున్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ అయిన “బొత్స సత్యనారాయణ”… మేము అవమానించలేదు. లడ్డూ కల్తీ, డెయిరీ అంశాలపై చర్చ కోసం మాత్రమే నిరసన చేశాం. చెప్పులు వేసుకుని పూజలు చేసే వారు మాకు నీతి చెప్పడం సరైంది కాదు. అని సమర్థించుకోవడం గమనార్హం.

ప్రజల్లో తీవ్ర ప్రతిస్పందనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని మహా అపరాధంగా భావిస్తే, మరికొందరు భగవంతుడు మీద భక్తి లేకుండా ప్రవర్తించడం మే కాకుండా హిందూ సమాజాన్ని కించపరచినట్లుగా భావిస్తున్నారు, మరికొందరు దీనిని రాజకీయలు లో భగవంతుడ్ని వాళ్ళ అవసరాలకోసం లాగుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా హిందూ సమాజంలో తీవ్ర చర్చ మొదలైంది.

Suresh Thota