Download App

“గుంటూరు ఘటన” చట్టం ముందు అందరూ సమానమే… నారా లోకేష్

జూలై 18, 2026 • By Srinivas
గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒక మహిళపై బహిరంగంగా, బరి తెగించి దాడి చేయడం పై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు కావడం...
"గుంటూరు ఘటన" చట్టం ముందు అందరూ సమానమే… నారా లోకేష్

గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒక మహిళపై బహిరంగంగా, బరి తెగించి దాడి చేయడం పై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు కావడం ఎక్కువ చర్చకు కారణమైంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ముందుగా గమనించేది నేరం కంటే ముందు ప్రభుత్వం ఎలా స్పందించింది…? అధికార పార్టీ తమ పార్టీ వ్యక్తిపై ఎలాంటి వైఖరి అవలంబించింది…? అన్న విషయాల పైనే దృష్టి సారిస్తారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీ ప్రాంతంలో ఒంటిపులి పద్మ అనే మహిళకు, స్థానిక టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణ మూర్తి (మల్లెల మూర్తి)తో బోరు బావి తవ్వకంనకు సంబంధించి వివాదం ఏర్పడింది. ఆ వివాదం తీవ్ర రూపం దాల్చి మహిళపై దాడి చేసినట్లు గా తెలుస్తుంది. బాధితురాలు తన ఫిర్యాదులో తనను దూషించారని, శారీరకంగా దాడి చేశారని, నిందితుడి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో కూడా తనపై దాడి చేయించారని ఆమె ఆరోపించారు. అయితే ఈ అంశం ప్రస్తుతం ఆరోపణ మాత్రమే. దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారణ చేయలేదు.

ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. సాధారణంగా అధికార పార్టీలపై వచ్చే ప్రధాన విమర్శ ఏమిటంటే, తమ నాయకులు తప్పు చేసినా వారిని రక్షించడానికి ప్రయత్నిస్తారనేది. కానీ ఈ ఘటనలో ఆ విమర్శకు అవకాశం ఇవ్వకుండా బాధ్యత గా వ్యవహరించాలని ప్రభుత్వం ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించారు. “తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే” అనే ఆయన వ్యాఖ్య ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేసింది.

ఈ వ్యవహారంలో మంత్రి “నారా లోకేష్” స్పందన కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. రాజకీయంగా తమ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, “పార్టీ తో అనుబంధం చట్టం నుంచి ఎవరినీ కాపాడదు. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం” అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. కేవలం ప్రకటనతో ఆగకుండా, నిందితుడిపై చట్టపరమైన చర్యలు వేగంగా తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగం నకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ చర్య ద్వారా ప్రజలకు చేరిన సందేశం ఒక్కటే నాయకుడైనా, కార్యకర్తైనా, చట్టం ముందు ప్రత్యేక హోదా ఉండదు , అందరూ సమానమే అనే భావనను బలంగా తీసుకెళ్ళినట్లయింది.

ఇక తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా రాజకీయంగా గమనించదగ్గది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లెల మూర్తిని వెంటనే పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. ఇది కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు, “తప్పు చేసిన వ్యక్తిని పార్టీ కాపాడదు” అనే సంకేతాన్ని ఈ చర్య ద్వారా పంపినట్లైంది. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా వెంటనే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇది కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా సాగాలనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని సూచిస్తోంది.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మర్చిపోవద్దు. ప్రభుత్వం వేగంగా స్పందించడం స్వాగతించదగ్గ విషయమే. కానీ ఇదే వేగం భవిష్యత్తు లో జరిగే ప్రతి కేసులోనూ కొనసాగాలి. అధికార పార్టీకి చెందిన వ్యక్తైనా, ప్రతిపక్ష నాయకుడైనా, సాధారణ పౌరుడైనా, ఎవ్వరైనాసరే చట్టం ఒకే విధంగా అమలైతేనే ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. ఒక కేసులో వేగం, మరో కేసులో జాప్యం ఉంటే ప్రజలు ప్రశ్నించడం సహజం.

అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ప్రతి విషయాన్ని వాస్తవంగా స్వీకరించడం కూడా ప్రమాదకరం. ముఖ్యంగా హిజ్రాల ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు అధికారిక నిర్ధారణ కోసం వేచి చూడాలి. ఆరోపణలు ఒక దశ, కోర్టులో నిరూపితమయ్యే వాస్తవాలు మరో దశ. ఈ రెండింటి మధ్య తేడాను సమాజం గుర్తించడం అవసరం.

గుంటూరు ఘటన చివరికి ఒక కేసు మాత్రమే కాదు. రాజకీయాల్లో బాధ్యత, మహిళల భద్రత, చట్ట పరిపాలన, పార్టీ క్రమశిక్షణ, ఈ నాలుగు అంశాలకు ఇది ఒక పరీక్ష. ఈ కేసులో ప్రభుత్వం ప్రారంభంలో చూపిన వేగం, కఠినత చివరివరకు అంటే, తీర్పు వరకు కొనసాగితేనే “చట్టం ముందు అందరూ సమానమే” అనే నినాదానికి నిజమైన అర్థం ఉంటుంది. అదే ప్రజాస్వామ్యానికి బలం. అదే మంచి పాలనకు అసలు ప్రమాణం.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading