
నకిలీ మద్యం కేసులో నిందితుడైన జనార్ధన్ రావు బయట పెట్టిన సంచలన విషయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారీకి పాల్పడ్డానని ఆయన బహిర్గతం చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారాన్ని ఆపేశానని, కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ తనను మళ్లీ ఆ వ్యాపారంలోకి లాగారని జనార్ధన్ రావు వెల్లడించారు.
జనార్ధన్ రావు మాట్లాడుతూ — “జోగి రమేష్ నన్ను ఫోన్ చేసి ‘టిడిపి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చేలా నువ్వు మళ్లీ నకిలీ మద్యం తయారు చెయ్యాలి’ అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు నేను తీసుకున్నాను. తంబళ్లపల్లె నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు, అది మనకి రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ చెప్పారు,” అని తెలిపారు.
అంతే కాకుండా, “వేరే వాళ్ల పేరు మీద రూమ్ అద్దెకు తీసుకున్నాం. లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్నీ తీసుకొచ్చాం. ‘లిక్కర్ తయారీ చెయ్యండి, మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదాం’ అని జోగి రమేష్ స్పష్టంగా నాకు చెప్పాడు. నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు,” అని తెలిపారు.
జనార్ధన్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక జోగి రమేష్ తనను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుడి దగ్గరకు పంపించాడట. “తర్వాత జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్‌మెంట్‌కి లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. దీని వెనుక ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడకు పంపించారు,” అని ఆయన తెలిపారు.
అయితే, ఈ మొత్తం ప్రణాళిక తర్వాత తనను పూర్తిగా వదిలేశారని జనార్ధన్ రావు ఆరోపించారు. “అన్నీ సక్సెస్ అయ్యాయని, ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకుందని చెప్పి, ‘ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా, నీకు బెయిల్ ఇప్పిస్తా’ అని జోగి రమేష్ హామీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. నా తమ్ముడినీ ఈ కేసులో ఇరికించాడు,” అని ఆయన బాధ వ్యక్తం చేశారు.
