Download App

అమరావతి… రాజధానిగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం…

ఏప్రిల్ 1, 2026 • By Suresh Thota
"పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను అంటలేదు" అన్నాడట ఒక ఆసామి అలా ఉంది వైకాపా పరిస్థితి పార్లమెంట్ లో, అమరావతి రాజధాని బిల్లు చర్చ సందర్భంగా… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా "అమరావతి" అని రూప కల్పన చేసిన బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభ ఆమోదం తెలిపింది....
అమరావతి… రాజధానిగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం…

“పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను అంటలేదు” అన్నాడట ఒక ఆసామి అలా ఉంది వైకాపా పరిస్థితి పార్లమెంట్ లో, అమరావతి రాజధాని బిల్లు చర్చ సందర్భంగా…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా “అమరావతి” అని రూప కల్పన చేసిన బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అన్ని బిల్లుకు మద్దతు తెలిపాయి.

అమరావతి బిల్లు పై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. బుధవారం ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. దీని తర్వాత ప్రెసిడెంట్ ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదం తో నోటిఫికేషన్ వెలువడుతుంది.

గతంలో వైసీపీ ప్రభుత్వం “మూడు రాజధానుల” ప్రతిపాదన వల్ల ఏర్పడిన అనిశ్చితికి తెరదించుతూ, అమరావతి ఏకైక మరియు శాశ్వత రాజధాని అని ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పించారు. భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం లేకుండా ఈ సవరణ గట్టి పునాది వేసింది. 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 ను సవరించి, “ఆంధ్రప్రదేశ్‌ కు కొత్త రాజధాని ఉంటుంది” అనే పదం స్థానంలో “అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గా ఉంటుంది” అని స్పష్టంగా చేర్చారు. గత నెల మార్చి 28 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ “అమరావతి” ని రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానం ఆధారంగానే కేంద్ర హోం శాఖ ఈ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

వైసీపీ ఎంపీ పి. మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించాయి. ఆయన ప్రధానంగా పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూనే, ప్రస్తుత బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. కాని రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై స్పష్టత లేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు ప్రభుత్వం గతంలో కేవలం 8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇప్పుడు లక్షల కోట్ల అంచనాలు వేయడం పై ఆయన అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు స్వరూపం సరిగా లేదని, దీన్ని యథాతథంగా ఆమోదించడానికి తాము సిద్ధంగా లేమని ఆయన ప్రకటించారు. భూములిచ్చిన 34 వేల మంది రైతులకు ఇంకా ప్లాట్లు కేటాయించలేదని, వారి సమస్యలను పరిష్కరించకుండా కేవలం చట్టబద్ధత కల్పించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, తమ పాత “మూడు రాజధానుల” వాదన తప్పని ఒప్పుకున్నట్లు అవుతుంది. అందుకే, నేరుగా “వ్యతిరేక ఓటు” వేసి నెగటివ్ అవ్వకుండా, ‘వాకౌట్’ చేసి సభ నుంచి బయటకు వెళ్లడం ద్వారా తమ నిరసనను తెలియజేశారు. ఈ ‘ద్వంద్వ వ్యూహం’ ద్వారా తమ శ్రేణులకు ఏమి సంకేతం ఇస్తున్నారో… వైసీపీ అగ్ర నాయకత్వం నకు తెలియాలి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading