ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి స్పందనతో మళ్లీ చర్చలోకి హెరిటేజ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హెరిటేజ్ అంశం ప్రాధాన్యం పొందింది. YSR Congress Party నేతలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో నారా భువనేశ్వరి ఒక వివరణాత్మక వీడియో విడుదల చేసి సంస్థ ప్రయాణం, లక్ష్యాలపై తన వాదనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
భువనేశ్వరి వైస్ చైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న Heritage Foods 1990లలో చిన్న స్థాయి పాల సేకరణ యూనిట్‌గా ప్రారంభమైంది. సుమారు రూ.4 కోట్ల పెట్టుబడితో మొదలైన సంస్థ, రైతుల భాగస్వామ్యం మరియు పాలు నాణ్యత ప్రమాణాలు పై దృష్టితో ప్రస్తుతం వేల కోట్ల విలువ గల డెయిరీ సంస్థగా అభివృద్ధి చెందిందని ఆమె పేర్కొన్నారు.
33 ఏళ్లుగా వినియోగదారులకు తాజా పాల ఉత్పత్తులు అందించడమే కాకుండా, పాడి రైతులు ఆర్థికంగా బలపడేలా చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల రైతులకు న్యాయమైన ధరలు, పారదర్శక చెల్లింపులు అందిస్తున్నామని తెలిపారు.
రైతుల నుంచి నేరుగా పాలు సేకరణ, స్థిరమైన ధరలను సమయానికి చెల్లించడం, ఇవే సంస్థ అభివృద్ధికి కారణమని భువనేశ్వరి వివరించారు.
గ్రామాల్లో చిల్లింగ్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలర్లు ఏర్పాటు చేయడం, పశువుల పోషణపై శిక్షణ ఇవ్వడం, వెటర్నరీ సేవలు అందించడం వంటి కార్యక్రమాల ద్వారా రైతు ఆదాయం పెరగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
“రైతు అభివృద్ధి చెందితేనే సంస్థ ఎదుగుతుంది” అనే సిద్ధాంతంతో తమ సంస్థ పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని భువనేశ్వరి తెలిపారు. పాల సేకరణ నుంచి ప్యాకింగ్ వరకు కనీసం 25 దశల్లో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు.
డెయిరీ రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రకటించిన “అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్” అవార్డును రైతులందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల తమ పై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆమె విమర్శించారు. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రచారం సరైంది కాదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో నిజాలను ప్రజలకు నేరుగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లుగా వివరించారు.