
పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ,దశాబ్దాలు గడిచినా కొన్ని గ్రామాలను పట్టిపీడించే కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. కానీ, ఒక నాయకుడి గుండెల్లో జనం కష్టం పట్ల నిజమైన ఆవేదన, ఆ సమస్యను తీర్చాలనే పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా అధిగమించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” నిరూపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని “పెదపెంకి” గ్రామాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫైలేరియా (బోద వ్యాధి) మహమ్మారికి కూటమి ప్రభుత్వం సాగించిన సమష్టి కృషితో చెక్ పెట్టారు. శనివారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విజయగాథను ఆయన స్వయంగా వెల్లడించారు.
2018లోనే కదిలిన హృదయం.. నాడే పడిన బీజం
“పెదపెంకి” గ్రామం అనగానే ఒకప్పుడు భయానకమైన బోద వ్యాధి కేసులే గుర్తొచ్చేవి. గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో సామాజిక అంతరాల వల్ల మురుగునీరు బయటకు పారే మార్గం లేక, ఒకే చోట నిల్వ ఉండిపోయింది. ఫలితంగా క్యూలెక్స్ దోమలు స్వైరవిహారం చేసి, ఏకంగా 197 బోద వ్యాధి కేసులు నమోదయ్యేలా చేశాయి. ఈ జాతీయ స్థాయి సమస్య 2018లోనే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఆనాడే ఈ దారుణ పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన చెందారు. అధికారం లేకపోయినా ఆనాడు ఆయన ఆ గ్రామ పంచాయతీ పరిస్థితి చూసి చాలా వ్యాకులత చెందరు. నేడు ఆయన అధికారంలోకి రాగానే కార్యాచరణగా మారింది.
జనాభాను హరించిన ఆ మహమ్మారిపై డిప్యూటీ సీఎం “పవన్ కళ్యాణ్” ఫోకస్ చేశారు. ఒకప్పుడు 7,900 జనాభాతో కళకళలాడిన “పెదపెంకి” గ్రామం, ఈ వ్యాధి తీవ్రత వల్ల గత పదేళ్లలో 12 శాతం జనాభాను కోల్పోయింది. రోగాల భయంతో జనం వలసబాట పట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, ఉప ముఖ్యమంత్రిగా “పవన్ కళ్యాణ్” ఈ ఏజెన్సీ గ్రామంపై వ్యక్తిగత శ్రద్ధ (Personal Focus) పెట్టారు. కేవలం నిధులు కేటాయించి వదిలేయకుండా, జిల్లా యంత్రాంగం తో నిరంతరం సమీక్షిస్తూ సమస్యకు మూల కారణాలను వెలికితీశారు.
ఆ గ్రామ విభేదాలు పక్కనబెట్టించి.. సమష్టిగా వాళ్ళని ఒప్పించి…. గ్రామంలో విభిన్న వర్గాల మధ్య ఉన్న అంతరాల వల్ల మురుగు కాలువల నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలుసుకున్న “పవన్ కళ్యాణ్”, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలను, సమన్వయం చేస్తూ డ్రైన్ల ఆక్రమణలను తొలగించారు. రూ.6.18 కోట్ల ఉపాధి హామీ నిధులును తక్షణమే మంజూరు చేయించి, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు 20 మ్యాజిక్ డ్రెయిన్లను, వర్షపు నీరు సజావుగా సాగిపోయేలా సీసీ రోడ్లను నిర్మించారు. మొదట్లో ఈ మార్పును వ్యతిరేకించిన గ్రామస్థులే, నేడు కంపు కొట్టే మురుగు కాల్వలు పోయి, గ్రామం స్వచ్ఛంగా మారడాన్ని చూసి ఉప ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి, అధికారులకు జేజేలు పలుకుతున్నారు.
“యంత్రాంగం సమష్టిగా పనిచేస్తే ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలనైనా సానుకూలంగా, సావధానంగా ఎలా పరిష్కరించవచ్చో పెదపెంకి గ్రామం ద్వారా నిరూపించాం.” అన్నారు పవన్ కళ్యాణ్. క్యూలెక్స్, ఎనాఫిలిస్ వంటి ప్రమాదకర దోమల లార్వాలను అంతమొందించి, పెదపెంకిలో సరికొత్త ఆరోగ్యకర వాతావరణాన్ని తెచ్చిన జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డిని, వారి బృందాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సమస్య పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే తాను స్వయంగా పెదపెంకి గ్రామాన్ని సందర్శిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ప్రజా నాయకుడికి నిబద్ధత ఉంటే…. పనులు ఎలా సాగుతాయి, అభివృద్ధి ఎలా సాధిస్తుంది అనే దానికి ఈ పెదపెంకి గ్రామమే నిదర్శనం.
ముగింపు: “నాయకుడి ఆలోచన ఉన్నతమైనది అయితే… అధికారుల శ్రమ సమష్టిదైతే…… ప్రజల సహకారం తో ఎంతటి అసాధ్యమైన సమస్య అయినా సుసాధ్యమవుతుంది.” ఇదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య అంతరాలు తొలగించి, ఊరి బాగు కోసం అందరినీ ఒక తాటిపైకి తెచ్చిన “పవన్ కళ్యాణ్” సర్వదా ప్రశంసనీయుడు.
