నారా లోకేష్–సుందర్ పిచాయ్ భేటీ… ఏపీని గ్లోబల్ టెక్ మ్యాప్‌లో నిలబెట్టే కీలక అడుగు
December 10, 2025 Published by Srinivas

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ) వేదికగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ నెట్‌వర్కింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే తదితర ప్రముఖ అధికారులు పాల్గొన్నారు.
సమావేశం సందర్భంగా పిచాయ్ కీలక విషయాలను వెల్లడించారు. గూగుల్ సంస్థకు చెందిన అత్యాధునిక డ్రోన్ విభాగం “వింగ్స్” తయారు చేసే డ్రోన్‌లు ప్రస్తుతం చెన్నైలోని ఫాక్స్‌కాన్ యూనిట్‌లో కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి అని తెలిపారు. భారతదేశం వైపు ప్రపంచ టెక్ దిగ్గజాల ఆసక్తి పెరుగుతోందని, హై-ఎండ్ హార్డ్‌వేర్ తయారీలో దేశం వేగంగా కీలక కేంద్రంగా ఎదుగుతోంది అని పేర్కొన్నారు.
నారా లోకేష్‌తో జరిగిన ఈ వ్యూహాత్మక భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో AI, క్లౌడ్ కంప్యూటింగ్, ఏరోస్పేస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లాంటి రంగాల్లో పెట్టుబడులు, సహకారాల అవకాశాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ & టెక్నాలజీ మ్యాప్‌లో ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఓ కీలక ముందడుగుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌కు, గూగుల్ నాయకత్వంతో జరిగిన ఈ సమావేశం మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
