
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగడం అత్యంత తీవ్రమైన అపచారమని LV Subrahmanyam, Tirumala Tirupati Devasthanams మాజీ ఈవో, ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి, తీవ్రంగా విమర్శించారు. తెలియక చేసిన చిన్న తప్పుకే భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని గుర్తుచేస్తూ, తెలిసీ, ప్రణాళికాబద్ధంగా రసాయనాలు కలిపిన నెయ్యిని స్వామివారి నైవేద్యాలకు వినియోగించడం మహాపచారమని ఆయన వ్యాఖ్యానించారు.
నెయ్యిలా వాసన, రంగు, ఆకారం రావడానికి ఏ రసాయనాలు కలపాలన్నది ముందే ప్లాన్ చేసి ఈ వ్యవహారం నడిపారంటే ఇది సాధారణ తప్పు కాదని, పెద్ద కుట్రేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్షల్లో కల్తీ తేలిన తరువాత కూడా అదే నెయ్యిని వినియోగించడం నేర స్వభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. 2022లోనే నెయ్యి కల్తీపై నివేదికలు వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కావాలనే చేసిన నిర్లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.
ఇక తప్పు జరగలేదని బొంకడం మానేసి, అసలు ఎవరు బాధ్యులో స్పష్టంగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారంతా బాధ్యత స్వీకరించి, తప్పును అంగీకరించి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి టీటీడీ ఈవో, ఛైర్మన్ ఇద్దరూ నైతికంగా, పరిపాలనా పరంగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈవో శ్రీవారికి అనుంగు సేవకుడని, ఏ లోపం జరిగినా బోర్డు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. అదే విధంగా తప్పులు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఛైర్మన్‌పైనా ఉందని, ఇద్దరూ జోడు గుర్రాల్లా కలిసి పనిచేయాల్సిందని వ్యాఖ్యానించారు.
ఈ మహాపచారంపై హిందూ సమాజమంతా ఏకమై న్యాయపరమైన చర్యలు కోరాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశంలో నిర్లక్ష్యం లేదా రాజకీయ వాదనలు మరింత ఆగ్రహానికి దారితీస్తాయని హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నెయ్యి సరఫరా వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. గుజరాత్‌లోని అమూల్ నమూనాను అనుసరించి, రాష్ట్రంలోని రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకుని దేశీ ఆవుల పాలతోనే నెయ్యి తయారు చేసే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. దీనివల్ల శ్రీవారి నైవేద్యాల పవిత్రత కాపాడబడడమే కాకుండా, వేలాది రైతు కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కూడా కలుగుతుందని అన్నారు. లడ్డూ నెయ్యి కల్తీ సాక్ష్యాలతో తేలిపోయిన తర్వాత కూడా తప్పు లేదని వాదించడం భక్తుల ఆగ్రహాన్ని మరింత పెంచుతోందని ఆయన హెచ్చరించారు.
