విజయవాడ సమీపంలోని కేసరపల్లి మేధా హైటెక్ సిటీ భవనంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మంత్రిని ఘనంగా ఆహ్వానించగా, సంస్థలో నియమించబడిన 300కుపైగా ఉద్యోగులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ప్రతి జిల్లాలో పరిశ్రమలను తీసుకురావాలన్నదే మా దృష్టి. రాష్ట్ర యువత భవిష్యత్‌కు బలమైన భరోసా ఇచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం,” అని పేర్కొన్నారు.
ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నందుకు ఎక్లాట్ సంస్థకు, మంత్రి లోకేష్ గారికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముందుగా, గుంటూరులో ఐసిఎఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పూర్తి” పేరుతో మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ విద్యార్థులతో తన విద్యాభ్యాసం, తొలి ఉద్యోగ అనుభవాలను పంచుకున్నారు. మంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న విద్యార్థులు కరతాళధ్వనులతో స్పందించారు.