
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం జరిగిన ముగింపు సభలో లోకేష్ భావోద్వేగంగా మాట్లాడుతూ, పార్టీ ఈ స్థాయికి ఎదగడానికి నాయకులు, కార్యకర్తల త్యాగాలే ప్రధాన కారణమని అన్నారు. వారి సంక్షేమం కోసం, అలాగే తెలుగుజాతి అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

“మన పార్టీకి ఢిల్లీ రాజకీయాలు కూడా తెలుసు, గల్లీ రాజకీయాలు కూడా తెలుసు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్నాం” అని ఆయన పేర్కొన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకు వచ్చిన బాధ్యత మరింత పెరిగిందని చెప్పిన లోకేష్, “నేనే అన్న భావన నాకు లేదు. అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుంది” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు ఎన్.టి. రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుజాతిని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడని ఆయన గుర్తుచేశారు.

కార్యకర్తలందరూ ‘మైటీడీపీ’ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని లోకేష్ సూచించారు. “మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే ఈ యాప్ ఉపయోగించాలి” అని ఆయన అన్నారు.
