
పులివెందులలో పోలింగ్ రోజు చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో వాహనాలకు నిప్పంటించిన ఘటనతో పాటు జగన్ పర్యటన, హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదం, దస్తగిరి ఎపిసోడ్‌పై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.
పోలింగ్ రోజున వాహనాలకు నిప్పంటించి వైసీపీ శ్రేణులే కొత్త డ్రామాకు తెరతీశాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హింసకు పాల్పడిన వారే ప్రత్యర్థులపై నిందలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదంటూ చేసిన ప్రచారం కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి ముందుగానే వచ్చి అనుమతి ఇవ్వలేదంటూ వివాదం సృష్టించారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, అనుమతి లేకుండానే భారీ వాహనాలతో పులివెందులలో ర్యాలీ నిర్వహించారని టీడీపీ విమర్శించింది. ఒకవైపు తమను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూనే, మరోవైపు జగన్ చిరునవ్వులతో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా వ్యవహరించారని పేర్కొంది.
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను బయటకు పిలిపించి, తమ వారిని లోపలికి అనుమతించడం లేదంటూ తప్పుడు ప్రచారం చేశారని కూడా టీడీపీ ఆరోపించింది. ఏ అభ్యర్థిపైనా, ఏ పోలింగ్ ఏజెంట్‌పైనా దాడి జరగలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేసినట్లు వెల్లడించింది.
ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి జగన్ ర్యాలీ సమయంలో రోడ్డుపైకి రావడం మరో వివాదానికి దారితీసింది. ఈ ఘటనను కూడా టీడీపీకి ఆపాదిస్తూ వైసీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని అధికార పార్టీ విమర్శించింది.
మరోవైపు, హింసకు పాల్పడినవారు వైసీపీ కార్యకర్తలేనని వీడియోల ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ పేర్కొంది. తనకు సంబంధం లేకపోయినా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ఏజెంట్లతో కలిసి వెళ్తానని జగన్ ప్రకటించడాన్ని కూడా తప్పుబట్టింది.
