వైభవంగా 17వ ఈశా గ్రామోత్సవం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
September 9, 2025 Published by Rahul N

17వ ఈశా గ్రామోత్సవం తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈరోజు ఘనంగా జరిగాయి. ఆగస్టులో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 జిల్లాలలో నిర్వహించిన పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీలలో సుమారు 3,300 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడ్డాయి.
ఈ సందర్భంగా గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ శ్రీ మల్క కొమరయ్య హాజరై ఆటగాళ్లను ఉత్తేజపరిచారు. ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి వక్తగా పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుక మరింత రంగరంగులుగా సాగింది. గిరిజన జానపద నృత్యం ‘గుస్సాడి’, చిరుతల రూపకం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. గాయని స్ఫూర్తి జితేంద్ర, ప్లేబ్యాక్ సింగర్ రామ్ మిర్యాల ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

పోటీల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి:
వాలీబాల్ (పురుషులు): అశ్వారావుపేట పోలీస్ టీం ప్రథమ బహుమతి గెలుచుకుంది. శివాలయం సిక్స్ బాయ్స్, చిన్నరేవల్లి, వూట్‌పల్లి VBA జట్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి.
త్రోబాల్ (మహిళలు): రాచర్ల గొల్లపల్లి టీం విజేతగా నిలిచింది. కొతపల్లి వారియర్స్, భద్రకాళి టీం, సంపల్లి వారియర్స్ జట్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి.

ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచిన మొదటి రెండు జట్లు సెప్టెంబర్ 21న కోయంబత్తూరులోని ఆదియోగి సమక్షంలో, సద్గురు ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ ఫైనల్స్‌లో పాల్గొననున్నాయి. ఫైనల్స్‌లో విజేతలకు రూ. 5 లక్షల నగదు బహుమతులు (వాలీబాల్, త్రోబాల్) అందజేయనున్నారు. మొత్తం బహుమతుల విలువ కోటికి పైగా ఉంది.
2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ క్రీడా స్ఫూర్తి, సంస్కృతిని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది.
