గవర్నర్ కు గౌరవం ఇవ్వాలి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్

Published by
Srinivas

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి అరుస్తూ, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీ లో జరిగిన ఈ ఘటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గౌరవ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ విధంగా వ్యవహరించడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమన్నారు అయ్యన్నపాత్రుడు. శాసనసభ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన వేదికగా, అతిథిగా ఆహ్వానించిన గవర్నర్ కి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని గుర్తుచేశారు.

ఒక ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ప్రవర్తించడం బాధాకరమన్న స్పీకర్.. ప్లకార్డులు పట్టుకొని పోడియం వద్ద కాగితాలు చింపి విసరడం, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించేలా ప్రవర్తించడం సంప్రదాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

ఆ విధంగా ప్రవర్తించిన సభ్యులు ఇప్పటికైనా విజ్ఞతగా, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రవర్తించాలని స్పీకర్ హితవు పలికారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.