ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలుచేసి తీరతామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, పథకాల అమలు మాత్రం ఆపమని స్పష్టంచేశారు.
“సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు తీయించేందుకు 30 కోట్లు ఖర్చయింది. పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ తీసేసి, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర వేసేందుకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వ భవనాలే కాకుండా.. కోడిగుడ్లు, చెట్లు, ఆలయాలకు కూడా వైసీపీ రంగులు వేసుకున్నారు. డబ్బంతా ఇలానే ఖర్చయిపోతోంది.”
వేసవి శెలవుల తర్వాత పాఠశాలలు రీ-ఓపెన్ చేసే టైమ్ కు 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇక మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని, అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20వేల రూపాయలు ఇస్తామని తెలిపారు సీఎం.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6వేల రూపాయలు ఇస్తుంటే, దానికి మరో 14వేల రూపాయలు జత చేసి రైతులకు మొత్తంగా 20వేల రూపాయలు అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు 3వేల రూపాయలు ఇస్తామని అన్నారు బాబు.