
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో ఆయన ‘జడలు’ అనే పాత్రను పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన గ్లింప్స్, పాటలు, నాని లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని ‘ది ప్యారడైజ్’ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన పాత్ర, యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మోహన్ బాబు పాత్ర, సోనాలి కులకర్ణి నటన, శ్రీకాంత్ ఓదెల మాస్ ట్రీట్‌మెంట్ తదితర అంశాలపై మాట్లాడారు.
‘జడలు’ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ లుక్ ఎలా వచ్చింది?
‘జడలు’ లుక్ కేవలం కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసింది కాదు. అది పూర్తిగా కథ నుంచి వచ్చింది. ఈ పాత్ర ఎందుకు ఇలా ఉంటుంది, అతని లుక్‌లోని ప్రతి అంశానికి కారణం ఉంటుంది.
ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఎక్కువగా మనకు తెలిసిన వ్యక్తిలా, మనకు రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ‘జడలు’ అలా కాదు. అతను సాధారణ సమాజంలో పెరిగిన వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచే అతనిలో ఒక రకమైన మ్యాడ్నెస్ ఉంటుంది. ఈ తరహా పాత్రను నేను ఇప్పటివరకు చేయలేదు.
మీ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ‘ది ప్యారడైజ్’లో హింస ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారా?
అలా ఏమీ లేదు. ఇది 100 శాతం ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా. కథలో తల్లి-కొడుకుల ఎమోషన్ చాలా కీలకం. హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ చిన్న పిల్లలను తీసుకురావడం కరెక్ట్ కాకపోవచ్చు
అయితే ఇది కేవలం యూత్ లేదా యాక్షన్ ఇష్టపడేవాళ్ల కోసం మాత్రమే చేసిన సినిమా కాదు. ఇందులో మంచి డ్రామా, ఎమోషన్, లవ్‌కు సంబంధించిన అంశాలు, కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.
‘ది ప్యారడైజ్’లో అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది?
నా సినిమాల్లో ఇప్పటివరకు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌లో ఇది బెస్ట్ అవుతుందని అనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’లో అనిరుధ్‌ను ఫుల్‌గా ఉపయోగించుకునే అవకాశం వచ్చింది.
‘జెర్సీ’కి ఒక ప్రత్యేకమైన మూడ్ ఉంది. ‘గ్యాంగ్ లీడర్’కు ఫన్ టోన్ ఉంది. కానీ ‘ది ప్యారడైజ్’లో సినిమా మొదటి నుంచి చివరి వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్‌ను హోల్డ్ చేసే స్కోప్ ఉంది. దాన్ని అనిరుధ్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.
తెలంగాణ జానపద సంగీతాన్ని అనిరుధ్ చాలా కొత్తగా తీసుకొచ్చారు. శ్రీకాంత్‌తో ఆయన కాంబినేషన్ ఎలా ఉంది?
అనిరుధ్‌కు సౌండ్‌పై చాలా మంచి గ్రిప్ ఉంది. శ్రీకాంత్‌కు తెలంగాణ ఫోక్ వాయిసెస్, జానపద పాటలపై మంచి అవగాహన ఉంది. వీరిద్దరి కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా మారింది.
శ్రీకాంత్ దగ్గర ఆలోచనలు, ఐడియాలు ఉంటాయి. వాటిని మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయగల సామర్థ్యం అనిరుధ్‌కు ఉంది. ‘ఆయె షేర్’, ‘యేసనాగులు’ పాటలు ఇంతగా క్లిక్ అవ్వడానికి వీరి ఇద్దరి కాంబినేషనే ప్రధాన కారణం.

మోహన్ బాబుని ఈ పాత్ర కోసం ముందుగానే అనుకున్నారా?
అవును. శ్రీకాంత్ నాకు మొదట కథ చెప్పినప్పుడే మోహన్ బాబు గారు ఈ పాత్రలో ఉంటే బాగుంటుందని అన్నాడు. అయితే ఇది చాలా బ్రూటల్, నెగెటివ్ క్యారెక్టర్. ఇలాంటి పాత్రను ఆయన చేస్తారా అనే సందేహం నాకు ఉండేది.
శ్రీకాంత్ ఆయనను కలిసిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. మోహన్ బాబు గారి ఎగ్జైట్మెంట్ చూసి నేను షాక్ అయ్యాను. కథ విన్న వెంటనే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆయనే నమ్మారు.
సౌత్ ఇండియా అంతా తిరిగి ప్రమోషన్స్ చేయడం ఎలా అనిపించింది?
ఇది నాకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సాధారణంగా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి భాషలో ట్రైలర్ ప్లే చేసి ప్రమోట్ చేస్తాం. కానీ ఈసారి అలా చేయకుండానే వెళ్లాం.
అప్పటికే ‘ఆయె షేర్’, ‘యేసనాగులు’ వంటి పాటలు తమిళ, మలయాళ ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయాయి. అందువల్ల సగం పని అప్పటికే అయిపోయినట్టే అనిపించింది. అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారనే ఫీలింగ్ వచ్చింది.
‘జడలు’ పాత్రలోకి వెళ్లడానికి ఎంత సమయం పట్టింది?
పాత్రలోకి వెళ్లడానికి పెద్దగా సమయం పట్టలేదు. కానీ ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది.
‘ది ప్యారడైజ్’లో యాక్షన్ ఎలా ఉంటుంది?
నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఇంత యాక్షన్ ఇంతకుముందు లేదు. కానీ ప్రతి ఫైట్‌కు కథలో ఒక బలమైన కారణం ఉంటుంది.
ఎక్కడో హీరో వచ్చి కొట్టేశాడనే తరహాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఒక ఎమోషన్ నుంచి మొదలవుతుంది. అందుకే థియేటర్‌లో ప్రతి పంచ్, ప్రతి కిక్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
ఈ సినిమాలో డ్యాన్స్ కూడా ఎక్కువగా చేశారా?
శ్రీకాంత్ చేయించాడు. నిజానికి నేను మంచి డ్యాన్సర్‌ని అని అతనికి చాలా నమ్మకం. ‘నువ్వు డ్యాన్స్ చేస్తే మస్త్ ఉంటది’ అని ఎప్పుడూ చెబుతుంటాడు.
అతని కాన్ఫిడెన్స్ కోసం నేను కూడా నన్ను నేను పుష్ చేసుకున్నాను. ‘ఆయె షేర్’ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. ‘యేసనాగులు’ పాటకు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రీల్స్ చేయడం చూశాను.

సినిమాలోని తల్లి-కొడుకు ఎమోషన్ ఎంత కీలకం?
సినిమా మొదటి నుంచి తల్లి-కొడుకు ఎమోషన్‌నే కీలకంగా చూపించాం. మొదటి గ్లింప్స్ కూడా ఒక తల్లి తన కొడుకు గురించి చెప్పడంతోనే మొదలవుతుంది.
సినిమా మొదలయ్యేది, ముగిసేది కూడా ఆ ఎమోషన్‌తోనే. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కేవలం యాక్షన్‌ను మాత్రమే గుర్తుపెట్టుకోరు. తల్లి-కొడుకుల బంధాన్ని ఒక హార్ట్‌వార్మింగ్ ఎమోషన్‌గా ఇంటికి తీసుకెళ్తారు. సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులు ‘ది ప్యారడైజ్’ మైండ్‌లో ఉండే అవకాశం ఉంది.
అసలు ‘ది ప్యారడైజ్’ అంటే ఏమిటి?
‘ది ప్యారడైజ్’ అనేది ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్న ‘సవారీలు’ అనే ఒక కల్పిత తెగకు సంబంధించిన కథ ఇది.
వారికి సమాజంలో ఎలాంటి గుర్తింపు ఉండదు. వాళ్లలో ఒకరిని ఎవరైనా చంపినా, అతను అధికారికంగా ఉన్న వ్యక్తి కాదనే కారణంతో కేసు కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో తమకు గుర్తింపు కావాలని, తమపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ఆ తెగ ఎలా నిలబడిందనేదే కథలో కీలక అంశం.
సినిమా ఏ కాలంలో జరుగుతుంది?
ఈ కథ సుమారు 1984-85 సమయంలో జరుగుతుంది. ఇది పూర్తిగా ఒక ఫిక్షనల్ వరల్డ్. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు బయట ప్రపంచాన్ని మర్చిపోయి ‘ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి ప్రేక్షకులు వెళ్లిపోయేలా ఈ ప్రపంచాన్ని రూపొందించారు.
శ్రీకాంత్ ఓదెల ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది?
శ్రీకాంత్ స్వయంగా ఒక ఎక్స్‌ట్రీమ్ మాస్ ఆడియన్. కమర్షియల్ మూమెంట్స్, మాస్ సీన్స్, ఎమోషన్స్‌ను అతను చాలా ఎంజాయ్ చేస్తాడు.
ఒక సీన్ బాగా వచ్చినా, ఒక షాట్ బాగా వచ్చినా థియేటర్‌లో ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో ముందుగానే ఊహిస్తాడు. ‘థియేటర్ ఊగిపోద్ది’ అని చెప్పేంతగా అతనికి మాస్ సినిమాపై నమ్మకం ఉంది.
ప్రమాదకరమైన యాక్షన్ షాట్స్‌ను డూప్ లేకుండా మీరే చేశారా?
నాకు ఇంకా ఆ ఓపిక, వయసు ఉన్నాయి కాబట్టి నేనే చేశాను. చిన్న షాట్ అయినా, నా కాల్ ఫ్రేమ్‌లోకి వచ్చినా అది నేను చేయకపోతే సినిమా చూస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది.
ఎవరైనా నా నటనను మెచ్చుకున్నా, ‘నాలుగు డూప్ షాట్లు తప్పితే’ అని నా ఇన్నర్ వాయిస్ చెబుతూనే ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ప్రతి షాట్ నేనే చేయాలని అనుకుంటాను.
‘జడలు’ లుక్ కోసం ఎంత సమయం పట్టేది?
ప్రతిరోజూ రెడీ అవ్వడానికి గంటన్నర నుంచి గంటా 45 నిమిషాల వరకు పట్టేది. ఆ లుక్ తీసేయడానికి మరో 20 నిమిషాలు పట్టేది.
జడలు చాలా ఇబ్బంది పెట్టాయి. స్కాల్ప్‌పై రెడ్ మార్క్స్ పడేవి. జడలు వేసుకున్న తర్వాత వెనక్కి కానీ, ముందుకు కానీ వాలలేకపోయేవాడిని. రోజంతా స్ట్రెయిట్‌గా కూర్చోవాల్సి వచ్చేది.
కొన్ని సందర్భాల్లో 36 గంటలు వరుసగా షూటింగ్ చేశాం. ఫైట్స్‌లో రోప్ వర్క్ చేస్తున్నప్పుడు జడలు రోప్‌కు చుట్టుకునేవి. ఫైట్ మాస్టర్స్ కూడా నన్ను చూసి జాలిపడేవారు.
రాఘవ్ జుయల్‌ను సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?
శ్రీకాంత్‌దే. రాఘవ్ డ్యాన్స్‌కు చాలా పాపులర్. అతని పాత్రలో బ్రూటల్ నేచర్ ఉన్నప్పటికీ బాడీ లాంగ్వేజ్‌లో ఒక లైట్ హార్టెడ్ నేచర్ ఉంటుంది.
అతనికి సంబంధించిన డ్యాన్స్ ఎలిమెంట్ కూడా సినిమాలో వస్తుంది. థియేటర్‌లో ప్రేక్షకులు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
కయాదు లోహర్ పాత్ర ఎలా ఉంటుంది?
ఆమె హీరోయిన్. కథలో చాలా సాలిడ్ క్యారెక్టర్ ఉంది. ఇది చాలా ముఖ్యమైన పాత్ర. ఒక హీరోయిన్‌కు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించే రోల్ ఇది.
సోనాలి కులకర్ణితో పని చేయడం ఎలా అనిపించింది?
సోనాలి మేడమ్ చాలా ప్రొఫెషనల్. తల్లి పాత్ర కోసం ఆమె పెట్టిన ఎఫర్ట్ అద్భుతం.
వర్షాల్లో, రాత్రి సమయాల్లో, బురదలో షూటింగ్ చేసినా ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలేదు. ఈ సినిమాకు ఆమె చాలా మంచి ఎంపిక. సినిమా విడుదలైన తర్వాత ఆమె నటనకు చాలా క్రెడిట్ వస్తుందని నేను నమ్ముతున్నాను.
జడలు వేసుకోవడంపై మీరు చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. దానిపై మీ స్పందన?
అది కేవలం ఒక జోక్. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా దాన్ని ఎలా కట్ చేసి ఎలా ట్విస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది.
జడల గురించి సరదాగా మాట్లాడుతున్న సందర్భంలోనే నేను కూడా చిన్నప్పుడు మనకు జడలు వేసేవారు, అందరూ జడలు వేసుకోవాలి అంటూ సరదాగా అన్నాను. ఎవరినీ ఫోర్స్ చేయాలనే ఉద్దేశం లేదు.
మనపై అటెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటను కొంతమంది పాజిటివ్‌గా, మరికొందరు నెగెటివ్‌గా తీసుకునే అవకాశం ఉంటుంది.
సినిమా విడుదల విషయంలో ఒత్తిడి ఉందా?
రెండుసార్లు రిలీజ్ డేట్ మారడంతో టైమ్ క్రంచ్ ఉంది. వర్క్ చాలా ఉందని తెలిసినా మరోసారి డేట్ మిస్ అవ్వకూడదని నిర్ణయించుకున్నాం.
అయితే క్వాలిటీ విషయంలో ఒక్క శాతం కూడా రాజీ పడలేదు. నిర్మాత సుధాకర్ గారు కూడా సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
ఇకపై మీ కెరీర్‌లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
నేను ఇప్పుడు చాలా సెక్యూర్డ్ స్పేస్‌లో ఉన్నాను. నా సినిమాలను నేను ఎంచుకోగలుగుతున్నాను. నాకు స్టార్ అనే ట్యాగ్ కావాలని కానీ, నన్ను రకరకాల కేటగిరీల్లో విభజించి పిలవాలని కానీ ఆసక్తి లేదు.
ఇక నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక మంచి ఫిల్మోగ్రఫీ ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాల జాబితా ఉండాలి. అంతే తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు.
