
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనిధి శెట్టి.. తన పాత్ర, త్రివిక్రమ్ దర్శకత్వం, వెంకటేష్ నటనతో పాటు సినిమా విశేషాలను పంచుకున్నారు.
త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్న కోరిక నెరవేరింది
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలన్న కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని శ్రీనిధి శెట్టి తెలిపారు. ఆయన నుంచి ఈ సినిమా కోసం పిలుపు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. త్రివిక్రమ్, వెంకటేష్ ఇద్దరికీ ఈ చిత్రం కొత్త జానర్‌లో రూపొందుతుండటం తనను మరింత ఆకర్షించిందన్నారు. త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ‘ఆదర్శ కుటుంబం’ పూర్తి భిన్నంగా ఉంటుందని, కథ విన్న వెంటనే ఈ సినిమాలో భాగం కావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఇందులో తాను తల్లి పాత్రలో నటిస్తున్నప్పటికీ, సినిమా చేయకూడదనే ఆలోచన ఒక్క క్షణం కూడా రాలేదని పేర్కొన్నారు. ఇలాంటి కథలు, పాత్రలు అరుదుగా వస్తాయని, వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటించడం ప్రత్యేకమైన అనుభవమని చెప్పారు.
తొలిసారి కామెడీ పాత్రలో..
‘ఆదర్శ కుటుంబం’ క్రైమ్ కామెడీ చిత్రమని, ఇందులో డార్క్ కామెడీ కూడా ఉంటుందని శ్రీనిధి శెట్టి తెలిపారు. ఇప్పటివరకు తాను చేయని తరహా పాత్రను ఇందులో పోషించానని చెప్పారు. తన పాత్ర చిట్‌ఫండ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అప్పులపాలవుతుందని వివరించారు. తొలిసారి కామెడీ పాత్ర చేయడంతో మొదట కొంత సందేహం కలిగినా, సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత ఎంతో సంతృప్తి కలిగిందని పేర్కొన్నారు.

త్రివిక్రమ్ డైలాగుల్లో ప్రత్యేకమైన మ్యాజిక్
త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే సంభాషణల్లో ఎంతో భావం ఉంటుందని శ్రీనిధి శెట్టి అన్నారు. ప్రతి డైలాగ్ చెప్పే ముందు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించానని వెల్లడించారు. సినిమాలో ఎన్నో మంచి సంభాషణలు ఉన్నాయని, ఆయన రచనలోని ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ట్రైలర్‌లోని “చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?” అనే డైలాగ్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు.
విడుదల ఆలస్యంపై నిరాశ చెందలేదు
సినిమా విడుదల తేదీ మారడంపై తాను నిరాశ చెందలేదని శ్రీనిధి శెట్టి స్పష్టం చేశారు. ఒక సినిమా కోసం ఏడాదిన్నర పాటు కష్టపడిన తర్వాత, అవుట్‌పుట్‌ను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటే కొంత ఆలస్యంగా విడుదల చేయడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. మెరుగైన ఫలితం కోసమే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30కి విడుదల తేదీని మార్చినట్లు నిర్మాత నాగవంశీ వివరించారని చెప్పారు. ఆ మూడు వారాల అదనపు సమయం సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడిందన్నారు.
వెంకటేష్ నటనను మ్యాచ్ చేయడం సాధ్యం కాదు
వెంకటేష్ అద్భుతమైన నటుడని, ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, భావోద్వేగ సన్నివేశాల్లో నటన ఎంతో సహజంగా ఉంటాయని శ్రీనిధి శెట్టి ప్రశంసించారు. ఆయన నటనను మ్యాచ్ చేయడం సాధ్యం కాదని, అయితే తన వంతుగా ప్రయత్నించానని చెప్పారు. త్రివిక్రమ్ సూచనలతో కామెడీ సన్నివేశాల్లో సహజంగా నటించేందుకు కృషి చేశానన్నారు. త్రివిక్రమ్ రచన, వెంకటేష్ నటన కలిసినప్పుడు కామెడీ సహజంగా పండుతుందని, ఆ సహజత్వానికి అనుగుణంగా తన పాత్రను తీర్చిదిద్దుకున్నానని వివరించారు.

కామెడీతో పాటు యాక్షన్ కూడా ఆకట్టుకుంటుంది
ఇటీవలే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను చూశానని, తనకు చాలా నచ్చిందని శ్రీనిధి శెట్టి తెలిపారు. షూటింగ్ సమయంలో ఎంతగానో ఆస్వాదించానని, తెరపై సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందం కలిగిందని చెప్పారు. సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, యాక్షన్ కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరిస్తుందని పేర్కొన్నారు.
త్రివిక్రమ్ వ్యక్తిత్వం ప్రత్యేకం
త్రివిక్రమ్ గొప్ప దర్శకుడని, ఆయన సినిమాల గురించి ముందే తెలుసునని శ్రీనిధి శెట్టి అన్నారు. అయితే ఆయనను కలిసిన తర్వాత వ్యక్తిగా ఆయన గొప్పతనం మరింత అర్థమైందని చెప్పారు. సినిమా గురించి చర్చించేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, సెట్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ నటీనటులకు ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తారని ప్రశంసించారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో పనిచేయడం సంతోషంగా ఉందని, చిత్రబృందం నటీనటులకు ఎంతో మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఈ బ్యానర్‌లో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్నానని, తెలుగులో కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని శ్రీనిధి శెట్టి వెల్లడించారు.
వెంకటేష్, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ కామెడీ, డార్క్ హ్యూమర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
