
అల్లరి నరేష్ మరో విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘ఆల్కహాల్’ – టైటిల్ వినగానే ఆసక్తి కలిగించేలా ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా, అది సినిమా మీద మంచి అంచనాలు పెంచింది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగినట్టు కనిపించడం, చిత్రం భ్రమల మధ్య నడిచే మనోవిజ్ఞాన నేపథ్యం కలిగిన కథగా ఉండబోతుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఇది పూర్తి ఎమోషనల్, రియాలిటీ మిక్స్‌డ్ డ్రామాగా అనిపిస్తోంది.
ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్ అందించనుండగా, ఛాయాగ్రాహకుడిగా జిజు సన్నీ, ఎడిటర్‌గా నిరంజన్ దేవరమానే పని చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేం మెహర్ తేజ్ ఈ సినిమాకు రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఆల్కహాల్’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా వైవిధ్యభరితమైన విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న నాగవంశీ ఈ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నారు.
అల్లరి నరేష్ ఈ సినిమాలో ఏ కొత్త కోణాన్ని చూపిస్తారో అన్న ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొంది. ‘ఆల్కహాల్’ ఫస్ట్ లుక్‌తో సినిమాపై హైప్ క్రియేట్ అవ్వడమే కాకుండా, నరేష్ అభిమానులకు ఇది మరో ప్రత్యేకత గల సినిమా అవుతుందనే నమ్మకాన్ని ఇస్తోంది.
