Download App

‘కులం’ సత్యం – సినిమా ‘మిథ్య’

ఫిబ్రవరి 19, 2026 By Suresh Thota
తెలుగు సినిమా ఇండస్ట్రీ… కుల జాడ్యంతో కుళ్లిపోతుంది అనాలో కూలిపోతుంది అనాలో అర్ధం కావడంలేదు. పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు తర్వాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో నిర్మాతలు అన్ని వర్గాల వారు ఉండేవారు. కులతత్వం అంత లేదు… ఇప్పుడు...
'కులం' సత్యం - సినిమా 'మిథ్య'

తెలుగు సినిమా ఇండస్ట్రీ… కుల జాడ్యంతో కుళ్లిపోతుంది అనాలో కూలిపోతుంది అనాలో అర్ధం కావడంలేదు. పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు తర్వాత తరం అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో నిర్మాతలు అన్ని వర్గాల వారు ఉండేవారు. కులతత్వం అంత లేదు… ఇప్పుడు వచ్చిన ఒక తరం బ్యాచ్ ఉన్నారు… వీళ్ళు… వీళ్ల ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆర్టిస్టులు కూడా మన వాళ్ళు, మన సామాజిక వర్గం వాళ్లే ఉండాలనేటంత స్థాయిలో ఈ కుల జాడ్యం వేళ్ళూనుకుపోతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది చిత్ర నిర్మాతలు, పరిశ్రమకి చెందిన వ్యక్తులు… ఒక సామాజికవర్గం నిర్మాతలను నిశితంగా పరిశీలించి చూస్తే నిజమే అనిపిస్తుంది. బిజినెస్ పరంగా టేబుల్ ప్రాఫిట్ కనపడే హీరోలను కాకుండా… కొంచెం వ్యాపారపరం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హీరోలను నిషేధం అనే పదం ఇక్కడ ప్రస్తావించలేము గాని… ఇంచు మించు అలాగే ఉంది. ఎందుకంటే కులజాడ్యం.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా వాసి కెక్కుతోంది, కుల జాడ్యంతో అధః పాతాళంకు జారిపోతోంది. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే ఒక హీరోని… మూకుమ్మడిగా ఒక సామాజిక వర్గం నిర్మాతలు… ఆ హీరోల తో సినిమాలు నిర్మించ కూడదు అని నిర్ణయం తీసుకునేంత వరకు వెళ్ళింది. ఇది ఎవరూ నిర్ధారించరు… నిరూపించలేరు… పరిశీలించి చూస్తే తప్ప… ఇక్కడ హీరోలది కూడా తప్పు ఉంది… ఏ సినిమా చేయాలో… ఏ కథ వినాలో వాళ్ళకి తెలియదు. వారి దగ్గర కథ వినే టీమ్ కు బాధ్యత ఉండదు. ఇక ఆ హీరోలకు కథ చెప్పేవారు ఎవరు…? వాళ్లకు వాస్తవాలు తెలియవు.

రెండోది బడ్జెట్ పై నియంత్రణ లేదు… తీసేది తెలుగు సినిమా అయినా కథను ఇంగ్లీష్ చెప్పాలి అనే వాళ్ళు కొందరు. మన వాళ్ళు ఉంటే పంపండి మంచి కథ కావాలి అనే వాళ్ళు కొందరు, కొంతమంది కార్పొరేట్ నిర్మాతలుకి లొకేషన్ బడ్జెట్, ఎక్సెల్ షీట్స్ మీద కావాలి. తప్పితే లొకేషన్ వెళ్ళి తెలుసుకుని రావాలి అనే జిజ్ఞాస లేకపోతుంది. కథలు మంచివి కావాలి మలయాళం లో హిట్ అవుతున్న టైప్ కావాలి… కాని కథ వినే ఓపిక లేదు. విన్నా జడ్జ్ చేసేటంత పదును వాళ్ళ మెదడు కి పెట్టటంలేదు. అసలే రేట్లు పెరిగి ప్రేక్షకుడు థియేటర్ కి రావడం లేదు అంటే… నిర్మాతలు ఇలా నిర్లజ్జగా మన, మన అనే సర్కిల్ లో కుచించుకుపోతున్నారు.

సినిమా చూసే ప్రేక్షకుడికి కులంతో సంబంధం లేదు… సినిమా బాగుంటే చూస్తాడు… లేకపోతే తిట్టుకుంటూ బయటకి వచ్చేస్తాడు… అంతే.. కాని కులం అనే మత్తు తో నిలువెల్లా ఊగిపోయే జనం కొంతమంది ఉంటారు. వాళ్ళు కులాభిమానంతో మొదటిరోజునే వాళ్ళ హీరో చిత్రం చూసేయాలి… తప్పులేదు అక్కడివరకు…బాగుంటే ఆనందిస్తారు లేకపోతే లేదు.

ఇందులో మరో కోవకు చెందినవారు ఉంటారు. దురాభిమానంతో… వాళ్ళను ఏమి చేయలేము, వారి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే… చాలా జుగుప్స కలిగించే విధంగా ఉంటాయి. సినిమా అనేది జనం కోసం తీసి వాళ్ళని మెప్పించి… నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అనే ఆలోచన ఎప్పటికీ వస్తుందో… వేచి చూడాలి… ఈ కుల జాడ్యం వీళ్లకు వదిలించు స్వామి… అని దేవుడ్ని కోరుకుందాం అంటే… దేవుళ్ళకి కూడా కులాలను అంటగడుతున్న వాళ్ళని ఏమనాలి…

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading