
హరిహర వీరమల్లు సినిమా విడుదల ఉందని తెలిసి కూడా థియేటర్లు బంద్ చేస్తాం అంటూ ఎగ్జిబిటర్లు ప్రకటించారు. ఈ మొత్తం వివాదం వెనక ‘ఆ నలుగురు’ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పబ్లిక్ గా ఓపెన్ అయ్యారో, అప్పుడిక తెరలు తొలిగిపోయాయి. ఒక్కొక్కరు బయటకొచ్చి మాట్లాడ్డం మొదలుపెట్టారు.
అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. ‘ఆ నలుగురు’ లో నేను లేను అని ప్రకటించుకున్నారు. తన దగ్గర 15 కంటే తక్కువ థియేటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడ్ని గౌరవపూర్వకంగా కలవాలని పవన్ చెప్పినప్పటికీ, తామంతా ఆ సూచనను పెడచెవిన పెట్టిన విషయాన్ని అరవింద్ బయటపెట్టారు.
ఇక రీసెంట్ గా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. తనదైన శైలిలో మాట్లాడారు. పవన్ ను పెద్దన్న అన్నారు. పవన్ తిడితే పడతామన్నారు. పవన్ సినిమాను అడ్డుకునే దమ్ము-దైర్యం ఎవ్వరికీ లేదన్నారు. పనిలోపనిగా ‘ఆ నలుగురు’ లో తను కూడా లేనన్నారు.
ఇవన్నీ గమనిస్తున్న బండ్ల గణేశ్ కు కోపం వచ్చింది. పవన్ వీరభక్తుడిగాపేరుతెచ్చుకున్న బండ్ల గణేశ్.. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. “ఆస్కార్ నటులు, కమల్ హాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం!” అంటూ ట్వీట్ చేశారు.
బండ్ల గణేశ్ ఎవ్వరి పేర్లు ప్రస్తావించలేదు, విషయం ఏంటనేది చెప్పలేదు. కానీ మేటర్ ఏంటనేది జనాలకు అర్థమైపోయింది. బండ్ల గణేశ్ టైమింగ్ ను అతడి ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
