
“గాంధీ గారి అహింసా వాదాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి “ఇలాంటి వ్యక్తి భూమ్మీద రక్తమాంసాలతో జీవించారంటే ముందు తరాల వారు నమ్మలేకపోవచ్చు” – ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.
అలాగే 150 చిత్రాలకు, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించినారు, ఆ వ్యక్తి ఒక తెలుగువాడు అంటే ముందు , ప్రపంచంలో ముందు, ముందు…. ఏ దర్శకులు నమ్మరేమో.
ఈరోజు “దర్శకుల దినోత్సవం” (Directors Day). భారతీయ సినీ చరిత్రలో, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక “దర్శకుడి” స్థాయిని, గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన వ్యక్తి, మహానుభావుడు, బహుముఖ ప్రజ్ఞా శాలి, దర్శకరత్న దాసరి నారాయణరావు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన జయంతిని పురస్కరించుకుని జరుపుకునే రోజే డైరెక్టర్స్ డే.
తెలుగు సినిమాను “హీరోల” నీడ నుంచి బయటకు తెచ్చి, “దర్శకుడే” సినిమాకు అసలైన “కెప్టెన్” అని చాటిచెప్పిన “దర్శకరత్నం దాసరి నారాయణరావు”. మే 4న ఆయన జయంతిని “దర్శకుల దినోత్సవం” గా జరుపుకోవడం అంటే, అది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం మాత్రమే కాదు… ఆయన సృజనాత్మకతకు, దక్కిన పట్టాభిషేకం.
సమాజంలో జరిగే ప్రతి కథ ఆయనకు ప్రేరణే…. సమస్యలే ఆయన కు కథా వస్తువులు… పరిస్థితులే ఆయన కలం లోని సిరా…. దాసరి సినిమా అంటే కేవలం వినోదం కాదు, భావోద్వేగ స్వరం. సమాజంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితు లపై పోరాటం. సామాజిక స్పృహ, కట్నకానుకలు, అంటరానితనం, రాజకీయ అవినీతి, మధ్యతరగతి తపన.. ఇలా ప్రతి అంశాన్ని ఆయన వెండితెరపై చర్చకు పెట్టారు.

మహిళా పక్షపాతి: “మనుషులంతా ఒక్కటే”, “బలిపీఠం” నుంచి “ఓ అమ్మాయి కథ” వరకు మహిళల అంతరంగాన్ని ఆవిష్కరించడంలో ఆయన శైలి అద్వితీయం. దాసరి కేవలం మెగాఫోన్ పట్టిన దర్శకుడు మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు వెలుగునిచ్చి, కొత్త నటీనటులను పరిచయం చేయడమే కాకుండా, అగ్ర హీరోల ఇమేజ్‌ను సైతం తన కథలతో మార్చేశారు. అత్యధిక చిత్రాల దర్శకుడిగా “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్” రికార్డ్స్‌లో చోటు సంపాదించడం ఆయన పనితనాన్ని, గొప్పతనాన్ని చాటుతుంది.
ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్టుల ఇబ్బందులైనా, కార్మికుల సమస్యలైనా, నటుల మధ్య ఇగో లైనా, ఏదైనా సరే “నేనున్నానంటూ” ముందుండి నడిపించిన ఆ “పెద్దరికం” లేని లోటు, నేడు చిత్ర పరిశ్రమకు ఒక తీరని వెలితి. ”దర్శకుడు అనేవాడు కథ రాసేవాడు మాత్రమే కాదు, కాలంతో పాటు ప్రయాణించి కాలాన్ని శాసించేవాడు.” ఇది దాసరి నమ్మిన సిద్ధాంతం.
నేటి సాంకేతిక విప్లవ కాలంలో విజువల్స్ పైన ఉన్న శ్రద్ధ, “కథ” మరియు “కథనం’ పై తగ్గుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో.. దాసరి గారి సినిమా పాఠాలు నేటి యువ దర్శకులకు దిక్సూచి. బడ్జెట్ కంటే బలమైన భావం మిన్న అని నిరూపించిన ఆయన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన, ఘనమైన నివాళి.
ముగింపు :
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు, నటులు మిగతా 24 చిత్ర పరిశ్రమ విభాగాలు, ఆ ప్రముఖుడికి ఇవ్వాల్సిన రీతిలో నివాళులు అర్పించడం లేదు, అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. చూస్తుంటే, నిజమే అనిపిస్తుంది. ఆయన తెలుగువాడు గా పుట్టడం మన అదృష్టం. ఆయన కు మాత్రం… మీ ఊహకే…
“దర్శకులందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు”.
