Download App

S Janaki: పాట ఆగినా.. జానకి స్వరం శాశ్వతం

జూలై 12, 2026 By Suresh Thota
భాషలకు అతీతంగా, భావాలకు చిరునామాగా నిలిచిన గానగంధర్వి ఎస్. జానకి ఇక భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆమె ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం, ప్రతి భావం సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటుంది. శాస్త్రీయ సంగీతం నుంచి జానపదం వరకు, మెలోడీ నుంచి...
S Janaki: పాట ఆగినా.. జానకి స్వరం శాశ్వతం

భాషలకు అతీతంగా, భావాలకు చిరునామాగా నిలిచిన గానగంధర్వి ఎస్. జానకి ఇక భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆమె ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం, ప్రతి భావం సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటుంది. శాస్త్రీయ సంగీతం నుంచి జానపదం వరకు, మెలోడీ నుంచి లాలిపాట వరకు, భక్తి గీతాల నుంచి భావోద్వేగ గానాల వరకు ప్రతి ప్రక్రియలో తనదైన ముద్ర వేసిన జానకమ్మ కేవలం గాయని మాత్రమే కాదు.. సంగీతానికి అంకితమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను, అపూర్వ విజయాలను, అరుదైన గౌరవాలను అందించింది. అలాంటి మహానుభావురాలి జీవితాన్ని, సంగీత వైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

ఉదాహరణకు S Janaki పాడిన కొన్ని గీతాలు….

శాస్త్రీయ, భక్తి రస గీతాలు….

“సామజవరగమనా…” (శంకరాభరణం) కేవలం కర్నాటక సంగీత పరిజ్ఞానమే కాకుండా, భావాన్ని పలికించడంలో ఆమె ప్రదర్శించిన ప్రతిభకు ఈ పాట ఒక నిదర్శనం.

“శివ శంకరీ శివానంద లహరి…” (జగదేకవీరుని కథ – హమ్మింగ్): ఘంటసాల గారు పాడిన ఈ క్లాసిక్ సాంగ్‌లో జానకమ్మ ఇచ్చిన హై-పిచ్ హమ్మింగ్ ఇప్పటికీ రోమాంచితం చేస్తుంది.

మెలోడీలు & ప్రణయ గీతాలు….

“సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా…” (పదహారేళ్ళ వయసు) అమాయకత్వం, ప్రేమ కలబోసిన ఈ పాట తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయి.

“కీరవాణి చిలకలాగ పాడగా…” (అన్వేషణ) ఇళయరాజా సంగీతంలో జానకమ్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట ఒక మధురానుభూతిని కలిగించే మెలోడీ.

“తెలిమంచు కరిగింది…” (స్వాతిముత్యం) శరదృతువు లాంటి ఆహ్లాదాన్ని పంచే గీతం.

లాలిపాటలు & విషాద గీతాలు:

“లాలీ లాలీ జో లాలీ…” (స్వాతిముత్యం): ఒక తల్లి హృదయాన్ని ఆవిష్కరించే ఈ లాలిపాట వింటే ఆర్ద్రత తో కన్నీళ్లు ఆగవు.

“పాడనా తెనుగు పాట…” (అమెరికా అబ్బాయి): తెలుగు భాషా ప్రాభవాన్ని, మాతృదేశంపై మక్కువను చాటిచెప్పే అద్భుత గీతం.

ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.

S Janaki: పాట ఆగినా.. జానకి స్వరం శాశ్వతం

చాలామందికి జానకి గారు కేవలం గాయనిగానే తెలుసు. కానీ ఆమె అద్భుతమైన పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు మరియు ప్రతిభావంతురాలైన సంగీత దర్శకురాలు కూడా, మన తెలుగు లో మూడో మహిళా సంగీత దర్శకురాలు. ఆమె “మానస దేవి” (1976), “ప్రాణ మిత్రులు” (1967) వంటి తెలుగు చిత్రాలకు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు దగ్గర సహాయకురాలిగా పనిచేశారు. అలాగే కొన్ని మలయాళ చిత్రాల్లో పాటలు కంపోజ్ చేశారు. తెలుగులో “మౌన పోరాటం” (1989) చిత్రానికి ఎస్. జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై, రామోజీరావు నిర్మించారు. లెజెండరీ నటీమణులు భానుమతి రామకృష్ణ , పి. లీల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకత్వం వహించిన మూడో మహిళగా జానకి చరిత్ర సృష్టించారు.

జానకి గారు ఎంత గొప్ప ఎత్తుకు ఎదిగినా, అంతే ఒద్దికగా ఉండేవారు. ఆమె ప్రశాంతమైన వ్యక్తిత్వం, నిరాడంబరత అందరికీ ఆదర్శం. ఆమె శ్రీ కృష్ణుడికి పరమ భక్తురాలు. ఆధ్యాత్మికతపై ఆమెకు ఉన్న భక్తితో, “మీరా” భజనలపై అనేక భక్తిగీతాల క్యాసెట్లను రికార్డు చేసి విడుదల చేశారు. ఆ పాటలలో ఆమె భక్తి, తన్మయత్వం తో కూడిన భావం శ్రోతల హృదయాలను తాకుతుంది. 2016 నుండి ఆమె పాటలు పాడటం నుండి విరామం ప్రకటించారు. అయితే, అభిమానుల కోరిక మేరకు 2018లో ఒక తమిళ చిత్రం కోసం ఆమె మళ్ళీ చివరిసారిగా ఒక పాట పాడారు. ఆ తర్వాత పూర్తిగా మైసూర్ లోని తన నివాసానికే పరిమితమై ప్రశాంత జీవనం గడుపుతున్నారు.

పురస్కారాలు

S.జానకి తిరుగులేని స్వర సంపదకు ఎన్నో పురస్కారాలు దాసోహమన్నాయి. 4 జాతీయ అవార్డులు, మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి 30కి పైగా అవార్డులను ఆమె గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక “కలైమామణి” పురస్కారాన్ని అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం ఆమె ప్రతిభను గౌరవిస్తూ “గౌరవ డాక్టరేట్” ప్రదానం చేసింది.

జాతీయ చలనచిత్ర పురస్కారాలు (National Awards) ఉత్తమ నేపథ్య గాయనిగా ఆమె 4 సార్లు అందుకున్నారు. “పదహారేళ్ళ వయసు” (1977), “సెంధూర పూవే” (తమిళం), శంకరాభరణం (1980) “సామజవరగమనా” (తెలుగు), “మౌనరాగం” (1986) “చిన్న చిన్న వణ్ణక్కుయిల్” (తమిళం), “ఓలంగళ్” (1982) “తుంబీ వా తుంబక్కుడతిన్” (మలయాళం), గాను,

రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు….

“ఆంధ్రప్రదేశ్” ప్రభుత్వ చలన చిత్ర “నంది అవార్డులు” (10 సార్లు), “కేరళ” రాష్ట్ర చలనచిత్ర అవార్డులు (14 సార్లు), “తమిళనాడు” రాష్ట్ర చలనచిత్ర అవార్డులు (7 సార్లు) ఆమె అందుకున్నారు.

ఆత్మగౌరవ శిఖరం:

2013 లో భారత ప్రభుత్వం ఆమెకు “పద్మభూషణ్” పురస్కారాన్ని ప్రకటించింది. అయితే, ఐదు దశాబ్దాలుగా దేశానికి సేవలందిస్తున్న దక్షిణ భారత కళాకారులకు ఢిల్లీ స్థాయిలో సరియైన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె ఆ పురస్కారాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అవార్డుల కంటే ఆత్మగౌరవమే మిన్న అని చాటిచెప్పిన ఆమె వ్యక్తిత్వం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

శతాబ్దానికి ఒక్కరు మాత్రమే పుట్టే అరుదైన గాత్ర కోకిల ఎస్. జానకి గారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా… పొద్దున్నే వినిపించే సుప్రభాతంలా, మధ్యాహ్నం సేదతీర్చే మెలోడీలా, రాత్రి నిద్రపుచ్చే లాలిపాటలా… ఐదు తరాల పాటల తోటగా ఆమె “స్వర ఝరి” నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అమర గాయని ఎస్. జానకి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అశ్రు నివాళులు అర్పిస్తూ…..

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading