
మెగాస్టార్ చిరంజీవి వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుండగా, ఈ షెడ్యూల్‌లో చిరంజీవి చూపించిన అంకితభావం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రస్తుతం సినిమాకే హైలైట్‌గా నిలిచే ఓ భారీ రెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో వందలాది మంది ఫైటర్లతో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ షెడ్యూల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది చిరంజీవి కమిట్‌మెంట్. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన షూటింగ్ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. మధ్యలో కేవలం గంటపాటు లంచ్ బ్రేక్ తప్ప, దాదాపు 12 గంటల పాటు కృత్రిమ వర్షంలోనే చిరంజీవి యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. చలిని, అలసటను ఏమాత్రం లెక్కచేయకుండా మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు అదే ఉత్సాహంతో నటించడం యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.

చిరంజీవి చూపించిన క్రమశిక్షణ, అంకితభావం చూసి చిత్రబృందం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశాన్ని కొత్త నటుడిలా అంకితభావంతో చేయడం ఆయన ప్రత్యేకత అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ భారీ రెయిన్ ఫైట్ సినిమా హైలైట్‌గా నిలుస్తుందని, థియేటర్లలో ప్రేక్షకులకు మాస్ విజువల్ ట్రీట్ అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తి వేగంతో సాగుతుండగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ టీజర్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, ఆంటోని ఎల్. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్‌ప్లే రాశారు. భాను–నందు సంభాషణలు అందిస్తున్నారు.
వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ రెయిన్ యాక్షన్ ఎపిసోడ్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది.
