Download App

‘ది ఇండియా స్టోరీ’.. పోరాటానికి సిద్ధమైన కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే

జూలై 10, 2026 By Rahul N
సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్న 'ది ఇండియా స్టోరీ' సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేతన్...
'ది ఇండియా స్టోరీ'.. పోరాటానికి సిద్ధమైన కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే

సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించగా, సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజా పోస్టర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ఎదుర్కొంటున్న పరిస్థితి సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కూరగాయల మార్కెట్ మధ్యలో కోపంతో ఉన్న జనాల నడుమ ఇద్దరూ నిలబడి ఉండగా, వారిపై కూరగాయలు విసురుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. చుట్టూ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, వారి ముఖాల్లో కనిపించే ఆందోళన.. వారు ఏదో పెద్ద నిజాన్ని బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోంది.

పోస్టర్‌పై ఉన్న “Slow Poison In Progress…” అనే ట్యాగ్‌లైన్ చిత్ర కథాంశాన్ని మరింత బలంగా సూచిస్తోంది. వ్యవసాయంలో ఉపయోగిస్తున్న విషపూరిత పురుగుమందులు, వాటి కారణంగా ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమా కోర్ట్‌రూమ్ డ్రామా రూపంలో ఆవిష్కరించనుంది.

పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ, “నిజం కోసం నిలబడేవారికి ఎదురయ్యే ప్రతిఘటన ఎంత తీవ్రమై ఉంటుందో ఈ పోస్టర్ చూపిస్తుంది. మోసంతో నడిచే వ్యవస్థను ప్రశ్నించినప్పుడు భయం, కోపం, ఒత్తిడి సహజమే. ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత తాము తినే ఆహారం, నమ్మే వ్యవస్థ గురించి ఒక్కసారి అయినా ఆలోచిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.

సినిమా జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రానికి స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, నిశాంత్ భగవత్ సినిమాటోగ్రఫీ, మంగేష్ ధాక్డే సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఆశిష్ మత్రే, సాహిత్యాన్ని షకీల్ అజ్మీ, సౌండ్ డిజైన్‌ను అన్మోల్ భావే నిర్వహిస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading