దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కలిసి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హాలీవుడ్ రేంజ్‌లో నిర్మించబడుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా టైటిల్ మరియు స్పెషల్ వీడియోను చిత్రబృందం ఘనంగా ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా మహేశ్ బాబు అభిమానులతో ముచ్చటిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. “మిమ్మల్ని కలుసుకుని చాలా రోజులైంది. మళ్లీ ఇలాంటి ఈవెంట్‌లో మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న కృష్ణగారు ఎప్పుడూ ‘పౌరాణిక పాత్ర చేస్తే నిన్ను చూడాలని ఉంది’ అనేవారు. ఆ మాటను ఎన్నోసార్లు చెప్పారు కానీ అప్పుడప్పుడు నేను వినలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా నా మాటలు వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి” అన్నారు.
సినిమా గురించి మాట్లాడుతూ మహేశ్ బాబు తన ఉత్సాహాన్ని దాచుకోలేకపోయారు. “ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. దీనికోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. మీరు అందరూ గర్వపడేలా, ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ఈ సినిమాను చేస్తాను. ‘వారణాసి’ విడుదలైనప్పుడు మొత్తం దేశం ఈ చిత్రాన్ని చూసి గర్వ పడుతుంది” అని స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై చిత్ర బృందం అత్యంత శ్రద్ధతో పనిని ముందుకు తీసుకెళ్తోంది.
హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ సాగా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.