Kantara Chapter-1: తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు… ఎన్టీఆర్ ఎమోషనల్
September 28, 2025 Published by Srinivas

రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అదే ఊపులో రిషబ్ శెట్టి కాంతార 2 (Kantara 2) కి శ్రీకారం చుట్టాడు. అదే ఇప్పుడు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార: చాప్టర్ 1 (Kantara Chapter-1). ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసి అంచనాలను ఆకాశానికెత్తింది.
హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భారీ ప్రీరిలీజ్ (Kantara Chapter 1 Pre Release) ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ…
“ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, అభిమాన సోదరులు, ‘కాంతార’ చిత్ర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎన్నో కథలు చెప్పేది. అవి నిజమా కాదా అనిపించేది కానీ ఎంతో ఆసక్తిగా విన్నేవాడిని. ఆ గుడి ఘాట్, ఆ జానపద వాతావరణం నాలో చిన్నప్పటి నుంచే నాటుకుపోయాయి. కానీ ఆ కథల్ని ఎప్పుడో తెరపై చూడబోతానని ఊహించలేదు.
ఆ కలను నిజం చేసిన వ్యక్తి నా బ్రదర్ రిషబ్ శెట్టి. చిన్నప్పుడు విన్న కథలు సినిమాలో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేను అంత ఆశ్చర్యపోతే, ఆ కథ తెలియని వాళ్ళు చూసి ఏమయ్యారో అదే ‘కాంతార’ విజయ రహస్యం. రిషబ్ చాలా అరుదైన దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌లో ప్రతీ క్రాఫ్ట్ మీద ఆయనకి పట్టుంది. ఈ సినిమాను ఈ స్థాయిలో తీయగల వ్యక్తి రిషబ్ మాత్రమే.

మా అమ్మకు ఉడిపి కృష్ణుడు దర్శనం కావాలనే కోరిక ఉండేది. ఆ కోరికను రిషబ్ నెరవేర్చారు. మా కుటుంబ సభ్యుడిలా మమ్మల్ని చూసుకున్నారు. అక్కడ ఆయన ‘కాంతార: చాప్టర్ 1’ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసాను. ఒక గుడికి వెళ్లే మార్గమే లేకపోయినా, రిషబ్ స్వయంగా ఆ మార్గాన్ని సృష్టించారు.
ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ డ్రీమ్‌ని నెరవేర్చడానికి హోంబలే ఫిల్మ్స్ అండగా నిలిచింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఈ చిత్రం గొప్ప బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.
ఈ స్టేజ్‌పై నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ కూడా ఉండి ఉంటే బాగుండేది. ఏదేమైనా, ఈ సినిమా బిగ్ బిగ్ బ్లాక్‌బస్టర్ అవుతుంది. అక్టోబర్ 2న తప్పక థియేటర్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేయండి. మా రిషబ్ గారి కష్టానికి మీరందరూ ఆశీర్వాదం అందించండి.”
ఎన్టీఆర్ మాటలతో ఈవెంట్ హాల్‌లో ఘనమైన చప్పట్ల సందడి నెలకొంది.
