
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ధర్మం కోసం పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ను చూడనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా చిత్ర బృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భావోద్వేగంగా స్పందించారు. “సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎ.ఎం. రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి. అజ్ఞాతవాసి సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక మాట రాశారు. “ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది”. అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్ని యుద్ధాలు చేయాలి. ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. నేను సినిమాల్లోకి రాకముందు ఎ.ఎం. రత్నం గారి లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎ.ఎం. రత్నం గారి తపన చూశాను.”అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ… “ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. దర్శకత్వానికి, క్రియేటివ్ పార్ట్ కి దూరమైన తర్వాత.. నా ప్రధాన దృష్టి రాజకీయాలపై ఉన్న సమయంలో.. నా దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు సినిమా చేయాలని అడిగినప్పుడు నా బెస్ట్ ఇచ్చాను నేను. ప్రస్తుతం నేను టైం ఇవ్వలేను. అలాంటిది నేను ఒక్క క్లైమాక్స్ కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మే నెలలో మండుటెండలో షూట్ చేశాము. సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఉంది. దీనికి పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి గారు. ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. ఆయన, రత్నం గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయనతో మాట్లాడుతుంటే సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని మాటలు వినిపిస్తున్న సమయంలో.. మాకు ప్రాణవాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి. నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప.. సినిమా గురించి పెద్దగా మాట్లాడను. కానీ, ఈ సినిమాకి మాట్లాడటం అవసరం అనిపించింది. నిర్మాతలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదు.” అని పేర్కొన్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “ఈ సినిమాకోసం పవన్ గారు అద్భుతంగా కృషి చేశారు. ఆయన డిజైన్ చేసిన 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి కీరవాణి గారికి 10 రోజులు మ్యూజిక్ కంపోజ్ చేయాల్సి వచ్చింది. అది మాటల్లో చెప్పలేం.”
నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ కల్యాణ్ గారితో పని చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది,” అన్నారు.
