
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థలలో ఒకటైన మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) భారీ వివాదంలో చిక్కుకుంది. రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) జరిపిన దర్యాప్తులో యూనివర్సిటీ రూ.26.17 కోట్లు అధిక ఫీజు వసూలు చేసినట్లు తేలింది.
2022 నుండి 2024 సెప్టెంబర్ వరకూ విద్యార్థుల నుంచి ప్రభుత్వానికి అనుమతించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసినట్టు కమిషన్ స్పష్టం చేసింది. దీంతో యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, 15 రోజుల్లోపు విద్యార్థులకు అధికంగా వసూలు చేసిన మొత్తం తిరిగి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారం తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల తర్వాత వెలుగులోకి వచ్చింది. కొంతమంది విద్యార్థులు క్యాంపస్‌లో నివసించకపోయినా, హాస్టల్ మరియు మెస్ ఛార్జీలను కూడా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు సభ్యుల కమిటీని APHERMC నియమించి విచారణ జరిపించింది. విచారణలో పలు ఆర్థిక అసంగతులు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. అంతేగాక, UGC, AICTE, PCI, ICAR వంటి జాతీయ నియంత్రణ సంస్థలకు కూడా ఈ విషయాన్ని తెలియజేసింది.
శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల నుండి 2022లో మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన ఈ సంస్థ గ్రీన్‌ఫీల్డ్ విభాగంలో స్వయంప్రతిపత్తి (Autonomous) హోదాను పొందింది. అయితే తాజా అవకతవకల నేపథ్యంలో యూనివర్సిటీ ప్రతిష్టకు గండిపడినట్లైంది.
కమిషన్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ మోహన్ బాబు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేయగా, తదుపరి విచారణ అక్టోబర్ 14న జరగనుంది.
ఈ పరిణామాలు రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ విధానాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. తదుపరి చర్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
