సినిమా వార్తలు

షూటింగ్ స్టేజ్‌లోనే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’ సినిమాపై భారీ క్రేజ్

Published by
Srinivas

ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజం Netflix మరోసారి కంటెంట్ ఎంపికలో తన ప్రత్యేకతను చాటుకుంది. విభిన్న కథలతో పాటు భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ ఉన్న సినిమాల డిజిటల్ హక్కులను ముందుగానే సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న నెట్‌ఫ్లిక్స్ తాజాగా తమిళ సినిమా ‘హైకూ’ డిజిటల్ హక్కులను దక్కించుకుంది.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. సినిమా షూటింగ్ పూర్తికాకముందే నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్‌ను క్లోజ్ చేయడం. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కులపై దృష్టి పెడతాయి. కానీ ‘హైకూ’ విషయంలో విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఈ ప్రాజెక్ట్‌పై నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1) కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ‘హైకూ’ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పేరన్బు’, ‘తరమణి’ వంటి చిత్రాల దర్శకుడు Ram తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తుండగా, విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. ‘జో’ వంటి సూపర్ హిట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న హరిహరన్ రామ్ ఈ సినిమాకు అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

సాంకేతిక బృందం కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ప్రియేష్ గురుస్వామి నిర్వర్తిస్తుండగా, శక్తి ప్రణేశ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటుల విషయానికి వస్తే.. ‘జో’, ‘కోళి పన్నై చెల్లదురై’ చిత్రాలతో గుర్తింపు పొందిన ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ చిత్రాలతో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పళ్ల కథానాయికలుగా కనిపించనున్నారు.

అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభావంతమైన సాంకేతిక బృందం కలయికలో రూపొందుతున్న ‘హైకూ’ సినిమా షూటింగ్ ప్రారంభ దశలోనే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచింది. సినిమా షూటింగ్ షెడ్యూల్స్, థియేట్రికల్ రిలీజ్ డేట్ సహా ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts