
నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సాధించింది. ఈ చిత్రం జాతీయ సమైక్యత, మత సామరస్యంపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు, యధు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడి పురస్కారం తెచ్చిపెట్టింది.
ఆగస్టు 9, 2024న విడుదలైన ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి స్పందన అందుకుంది. కుల వివక్ష, స్నేహం, సామాజిక అంశాలను హాస్యంతో మిళితం చేసి ఆకట్టుకుంది. అన్ని కొత్త టాలెంట్‌తో తెరకెక్కినప్పటికీ నిహారిక ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన తీరు ప్రశంసలందుకుంది.
ఈ విజయం మీద నిహారిక స్పందిస్తూ.. “మా చిత్రానికి గద్దర్ అవార్డ్స్‌లో గుర్తింపు లభించడాన్ని గర్వంగా భావిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు, జ్యూరీ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిగతా విజేతలందరికీ అభినందనలు.”

దర్శకుడు యధు వంశీ… “ఈ గుర్తింపు నాకు, మా బృందానికి చాలా ప్రేరణనిస్తుంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని అన్నారు.
ఈ చిత్రంలో సందీప్ సరోజ్, త్రినాధ్ వర్మ, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకు పాటలు అనుదీప్ దేవ్ అందించగా, సినిమాటోగ్రఫీకి ఎదురురోలు రాజు పనిచేశారు.
ఈ రెండు అవార్డులతో ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన చిత్రాలతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు.
