‘దండోరా’ నుంచి ‘పిల్లా…’ లిరికల్ సాంగ్ – ప్రేమికుల హృదయాలను తాకుతున్న మెలోడీ
December 1, 2025 Published by Srinivas

ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ రావడానికి ప్రేమికుడు పడే టెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఐ లవ్ యూ చెప్పిన తరువాత ఆమె ఏమంటుందోనన్న ఆ ఉత్కంఠ, ఇద్దరి మధ్య మాటలకంటే చూపులు ఎక్కువ మాట్లాడే ఆ క్షణాలు—ఇవి ప్రేమికుల ప్రయాణంలోని మధురమైన అధ్యాయాలు. ఇలాంటి భావోద్వేగాలను అద్భుతంగా పట్టుకునే కథతో రూపొందుతున్న చిత్రం ‘దండోరా’ అని మేకర్స్ చెబుతున్నారు.
కలర్ ఫొటో, బెదురులంక 2012 వంటి వినూత్న చిత్రాలను అందించిన లౌక్య ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బింధు మాధవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్‌కి అద్భుత స్పందన
ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్యూమర్‌తో పాటు పక్కా సోషల్ మెసేజ్‌ని డీల్ చేస్తోందన్న క్లారిటీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. డిఫరెంట్ ప్రొమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆసక్తి రేపిన చిత్రం నుంచి తాజాగా ‘పిల్లా…’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.

మధురానుభూతిని పంచే మెలోడియస్ సాంగ్
“దండోరా కొట్టుకుందురో… గుండెల్లో కొత్తగుందిరో
నింగి నేల ఇలా… దారి కుదిరిందెలా
కళ్లారా చూడబోతినో… కల్లోలం లాగుంటదే
దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా
పిల్లా ఇట్టసూడవే… తొంగి నన్ను చూడవే…”
అంటూ సాగిన ఈ మెలోడీ ప్రేమికుల మనసులను హత్తుకుంటోంది.
ఈ పాటకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి–అదితి భావరాజు స్వరాలు సమకూర్చారు. సాహిత్యాన్ని పూర్ణా చారి రాశారు. ప్రేమలో దాగిన భావాలను అందంగా ఆవిష్కరించిన మృదువైన రొమాంటిక్ ట్రాక్‌గా ఈ పాట నిలుస్తోంది.
సామాజిక అంశంపై దండోరా
ఓ కీలక సామాజిక సమస్యను కేంద్రంగా చేసుకుని రూపొందుతున్న సినిమా ఇది. ముఖ్యంగా అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమ, వివాహ నేపథ్యాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ జరిగే దౌర్జన్యాలను కథలో చూపిస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, అక్కడి సంప్రదాయాలు, పాత ఆచారాలను నిజమైన నేస్తాలతో చూపిస్తూనే వ్యంగ్యం, హాస్యం, హృదయాన్ని తాకే భావోద్వేగాలుగా అందించబోతున్న చిత్రం ‘దండోరా’.
