సినిమా వార్తలు

రాజమౌళిపై ట్రోల్స్‌కి ఆర్జీవీ కౌంటర్… హారర్ సినిమా తీయాలంటే దయ్యమైపోవాలా?

Published by
Srinivas

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కొత్త అడ్వెంచర్‌ డ్రామా “వారణాసి” టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో పెద్ద వివాదం రేగింది. అంతే కాకుండా పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈవెంట్ సమయంలో వరుసగా టెక్నికల్ సమస్యలు రావడంతో కొంత అసహనానికి గురైన రాజమౌళి, “ఈసారి హనుమంతుడు మాకు సహాయం చేయలేదు” అని సరదాగా చెప్పి, తాను నాస్తికుడినే అని కూడా స్పష్టం చేశారు.

అయితే ఈ మాటలు సోషల్ మీడియాలో పెద్ద వివాదాన్నిరేపాయి. హనుమంతుడి భక్తులు మరియు కొన్ని హిందూ సంఘాలు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “తమ టీమ్ తప్పులను దేవుడిపై మోపుతున్నాడు”, “నాస్తికుడైన వాడు హిందూ పురాణాలపై సినిమాలు ఎందుకు తీస్తాడు?” అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

అతనిపై వస్తున్న విమర్శల్లో ఒకటి — “దేవుణ్ణి నమ్మని వాడు దేవుడిపై సినిమాలు ఎందుకు తీస్తాడు?” అన్నది. దీనిపై దర్శకుడు ఆర్జీవీ వ్యంగ్యంగా, “అలా అంటే గ్యాంగ్‌స్టర్ సినిమా తీసేందుకు దర్శకుడు గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే దయ్యమైపోవాలా?” అని ప్రశ్నించారు.

అంతేకాదు, దేవుణ్ణి నమ్మకపోయినా రాజమౌళికి వంద రెట్లు ఎక్కువ విజయాలు, సంపద, అభిమానాభిమానాలు వచ్చాయని, అది భగవంతుడే ఇచ్చినదే కదా అన్నట్లుగా వ్యాఖ్యానించారు. “అంటే దేవుడు నాస్తికులను ఎక్కువగా ప్రేమిస్తాడా? లేక అసలు ఎవరు నమ్మినా, నమ్మకపోయినా దేవుడికి పెద్దగా పట్టదా?” అని ఆర్జీవీ చురకలంటించారు.

అయితే నిజమైన సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని, దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన సాధించిన అసాధారణ విజయాలే కొందరిని కడుపు మంటపెడుతున్నాయి అని వర్మ స్పష్టం చేశారు.

చివరగా, వారణాసి ద్వారా కూడా భగవంతుడు రాజమౌళి ఖాతాలో మరో భారీ బ్లాక్‌బస్టర్ జమ చేయబోతున్నాడని, అసూయపడేవారు మాత్రం కోపంతో రిలాక్స్ అవ్వలేకపోతారని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
“ఇది దేవుని ప్రేమ కాదు… కొందరి అసూయను ‘భక్తి’గా ప్యాక్ చేసి చూపించడం మాత్రమే” అని ఆయన ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చారు.

Srinivas