సినిమా వార్తలు

ఆ లైన్స్ ఎక్కువగా ప్రేక్షకులు కోట్ చేస్తున్నారు… ‘రై రై రా రా’ పాటపై లిరిసిస్ట్ అనంత శ్రీరామ్

Published by
Srinivas

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మ్యాసివ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’లోని రెండో సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విడుదలైన క్షణాల నుంచే ఈ పాట రికార్డు స్థాయి వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, ఏఆర్ రెహ్మాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత శ్రీరామ్ సాహిత్యం కలిసి ఈ పాటను వైరల్ హిట్‌గా నిలబెట్టాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘రై రై రా రా’ పాటకు సంబంధించిన విశేషాలను లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పంచుకున్నారు. పాటకు వస్తున్న అద్భుతమైన స్పందన తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రామ్ చరణ్ రుద్రతాండవం, ఏఆర్ రెహ్మాన్ శక్తివంతమైన సంగీతం, రత్నవేలు విజువల్స్ మధ్యలో కూడా పాట సాహిత్యానికి ప్రత్యేకంగా ప్రశంసలు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

ఈ పాట సాధారణ ప్రేమగీతం కాదు, ఐటెం సాంగ్ కూడా కాదు. అయినప్పటికీ సాహిత్యం గురించి ప్రజలు ప్రత్యేకంగా మాట్లాడటం దర్శకుడు బుచ్చిబాబు సన సాహిత్యానికి ఇచ్చే ప్రాముఖ్యత వల్లే సాధ్యమైందని చెప్పారు. ఈ పాటలో ఉండాల్సిన భావాలు, పదాలపై తాము చాలా సమయం కేటాయించామని, రాత్రిళ్లు రింగ్ రోడ్డుపై డ్రైవ్ చేస్తూ, కాఫీ షాపుల్లో చర్చలు చేస్తూ నెలల తరబడి పని చేసి ఈ పాటను సిద్ధం చేశామని తెలిపారు.

యూత్‌కు ఒక యాంథమ్‌లా ఉండేలా ఈ పాటను రూపొందించాలని దర్శకుడు బుచ్చిబాబు సూచించారని అనంత శ్రీరామ్ చెప్పారు. అందుకే ఈ పాటను ఒక గేయ కవితలా రాయాలని నిర్ణయించుకుని, మహాకవి శ్రీశ్రీ రచనలలో కనిపించే ఉత్సాహం, భావోద్వేగం కలిగించే ప్రాసలతో ఈ పాటను రూపొందించానన్నారు.

ఈ పాటలోని కొన్ని లైన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా “నువ్వు నిన్నే నీలోపల పాతేసుకోకోయ్… పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా…” అనే లైన్స్ ఎక్కువగా ప్రేక్షకులు కోట్ చేస్తున్నారని చెప్పారు.

‘రై రై రా రా’ అనే పదాన్ని ఉపయోగించడానికి కూడా ప్రత్యేకమైన ఆలోచన ఉందని అనంత శ్రీరామ్ వెల్లడించారు. గ్రామాల్లో ఆర్టీసీ బస్సు కండక్టర్ “రై రై” అని చెప్పగానే బస్సు ముందుకు కదులుతుంది. అదే ప్రేరణతో జీవితమనే ప్రయాణం కూడా ముందుకు సాగాలని సూచించే భావంతో పాటను ఆ పదంతో ప్రారంభించామని వివరించారు.

ఈ పాట విజయంలో తన సాహిత్యం మాత్రమే కాదు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు విజువల్స్, ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ముఖ్యంగా రామ్ చరణ్ చూపించిన చరిష్మా కలిసి పనిచేశాయని చెప్పారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు బుచ్చిబాబు సానాకే చెందుతుందని, అలాగే ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రామ్ చరణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పాటను షూటింగ్ లొకేషన్‌లో రామ్ చరణ్‌కు వినిపించినప్పుడు ఆయన ఎంతో ఆనందంగా స్పందించి తనను హత్తుకున్నారని అనంత శ్రీరామ్ గుర్తుచేశారు. మాస్ భాషలో ఫిలాసఫీ చెప్పడం చాలా కష్టమైన పని అని, పైగా ఏఆర్ రెహ్మాన్ బాణీలు ప్రయోగాత్మకంగా ఉండటం వల్ల ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలల పాటు కసరత్తు చేశానన్నారు.

సినీ పరిశ్రమలో తనకు దాదాపు 20 ఏళ్ల ప్రయాణం పూర్తయిందని, అవకాశాన్ని పొందడం కష్టం, మొదటి విజయాన్ని సాధించడం ఇంకా కష్టం, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అత్యంత కష్టమని తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక చార్ట్‌బస్టర్ ఇవ్వగలగడం తన తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు, తాను ఎప్పటికప్పుడు కొత్తగా మారాలనే తపన వల్లే సాధ్యమైందన్నారు.

మెగా ఫ్యామిలీతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, తాను పాటల రచయితగా తొలి గుర్తింపు పొందిన చిత్రం చిరంజీవి గారి ‘అందరివాడు’ అని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల హీరోలతో పని చేసి మంచి పాటలు రాయడం తనకు గొప్ప అదృష్టమని తెలిపారు. చిరంజీవి గారు తండ్రిలా ప్రేమిస్తారని, రామ్ చరణ్ సోదరుడిలా ఆప్యాయత చూపుతారని అన్నారు.

ప్రస్తుతం తాను ‘స్పిరిట్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలకు పాటలు రాస్తున్నానని, వాటిలో కూడా చాలా మంచి పాటలు వస్తాయని అనంత శ్రీరామ్ వెల్లడించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.