పశ్చిమాసియాలో (Middle East) ఇరాన్ మరియు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిస్థితుల రీత్యా…. విస్తృతంగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పై ప్రభావం పడుతుంది. దాని మూలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత దేశం తన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. భారత్ వద్ద ఉన్న ఆయిల్ నిల్వలు, వినియోగం మరియు ప్రత్యామ్నాయ మార్గాలపై ఒక చిన్న విశ్లేషణ.
140 కోట్ల జనాభా కలిగిన భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు దేశం. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 59 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తోంది. అంతర్జాతీయంగా బ్యారెల్ లో కొలుస్తారు… ఒక బ్యారెల్ అంటే సుమారు 159. లీటర్లు. దీని ప్రకారం… మన దేశం రోజుకు దాదాపు “93.8 కోట్ల” లీటర్ల చమురును వాడుతోంది. ఈ ఆయిల్ వినియోగమే… మన దేశ ఆర్థిక చక్రం నడవడానికి ప్రధాన ఇంధనం.
యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడి, దిగుమతులు నిలిచిపోతే భారత్ ఎన్ని రోజులు తట్టుకోగలదు అంటే… దీనిని ఆర్థిక నిపుణులు రెండు రకాలుగా విభజించారు… “వ్యూహాత్మక నిల్వలు” (Strategic Reserves) ప్రభుత్వం విశాఖపట్నం, మంగళూరు, పాడూరులలో(కర్ణాటక) భూగర్భ గుహలలో దాచిన అత్యవసర నిల్వలు. ఇవి సుమారు 9 నుండి 10 రోజులకు సరిపోతాయి.
“వాణిజ్య నిల్వలు” (Commercial Stocks) దేశంలోని ఆయిల్ కంపెనీలు (IOCL,HPCL, BPCL మొదలైనవి) తమ శుద్ధి కర్మాగారాలు మరియు పైప్‌లైన్లలో ఉంచే నిల్వలు. ఇవి సుమారు 64 రోజులకు సరిపోతాయి.
భారత్ వద్ద సుమారు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు తన దిగుమతులను, ప్రస్తుతం సుమారు 30 దేశాల నుండి ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నది. ముఖ్యంగా రష్యా (ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది), ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగునవి.
ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz)లో కార్గో షిప్స్ ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి… ఒకవేళ ఎక్కువ రోజులు మూతపడితే, గల్ఫ్ దేశాల నుండి సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల భారత్‌కు కలిగే నష్టాలు…. అంతర్జాతీయంగా చమురు ధర పెరగడం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఆయిల్ కోసం ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి రావడంతో భారత రూపాయి విలువ పడిపోతుంది. ప్రత్యామ్నాయంగా రష్యా మరియు అమెరికా నుండి దిగుమతులు పెంచుకోవాల్సి ఉంటుంది, కానీ రవాణా ఖర్చులు పెరిగి భారత్ పై అదనపు భారం పడుతుంది.
భారత్ తన వ్యూహాత్మక నిల్వలను (Phase-II) మరింత పెంచే పనిలో ఉంది. ఒడిశాలోని చండీఖోల్ వంటి ప్రాంతాల్లో కొత్త నిల్వ కేంద్రాలు పూర్తయితే, మన భద్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతానికి 74 రోజుల నిల్వలు మనకు ఒక రక్షణ కవచంలా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగాయి కదా, మరి ఆయిల్ వినియోగం ఎందుకు తగ్గలేదు?” అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కాని మన దేశ జనాభా, పరిశ్రమలు, మరియు కొత్త వాహనాల సంఖ్య ప్రతి ఏటా భారీగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు రాకపోయి ఉంటే, మన ఆయిల్ వినియోగం ఇప్పుడున్న దాని కంటే ఇంకా భయంకరంగా పెరిగిపోయేది.
గతంలో కరెంటు కోసం డీజిల్ జనరేటర్లు వాడేవారు, ఇప్పుడు సోలార్ వల్ల అది తగ్గింది. కాని వాణిజ్య వాహనాలు, విమానాలు, షిప్పులు మరియు ఫ్యాక్టరీలలో ఇప్పటికీ డీజిల్, పెట్రోల్ వాడకం తప్పనిసరి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు మన ఆయిల్ వినియోగాన్ని “తగ్గించలేకపోయినా”, అది “విపరీతంగా పెరగకుండా” అడ్డుకుంటున్నాయి. రాబోయే 5-10 ఏళ్లలో వీటి సంఖ్య ఇంకా పెరిగితేనే మనం ఆయిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
భారత్ తన సొంత ఆయిల్ నిల్వలను పెంచుకుంటూనే, మరోవైపు ఇథనాల్ (చెరుకు రసంతో చేసే ఇంధనం), హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ వైపు వేగంగా మళ్లుతోంది. మనం ఎంత త్వరగా పెట్రోల్ వాహనాల వాడకం తగ్గించి, దాని నుండి బయటపడితే, దేశానికి అంత ఆర్థిక భద్రత ఉంటుంది అని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.