
సమంత రూత్ ప్రభు మరియు దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం లింగ భైరవి ఆలయంలో జరిగిన తర్వాత, “భూత శుద్ధి వివాహం” అనే పదం ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ట్రోల్స్, మీమ్స్, విమర్శలు ఇవన్నీ వైరల్ అవుతున్నా, అసలు ఈ సంప్రదాయం ఏమిటి అన్న విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. ఈ వివాహ విధానం సాదారణంగా వినిపించే పద్ధతి కాదు. కాబట్టి దాని నేపథ్యం, అవసరం, మరియు విశ్వాసం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం.
భూత శుద్ధి వివాహం అనేది మనిషి శరీరాన్ని నిర్మించే పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవి అసమతుల్యంగా ఉన్నప్పుడు జరిగే దోషాలను తొలగించడానికి చేసే ఆధ్యాత్మిక క్రతువు. ఈ క్రతువులో పూజలు, ధ్యానాలు, శరీర–మనసు శుద్ధి ప్రక్రియలు ఉంటాయి. పంచభూతాలకు సంబంధించిన శుద్ధి పూర్తయ్యాకే వివాహం జరపడం ఈ సంప్రదాయం ప్రత్యేకత.
భారతీయ వివాహ వ్యవస్థలో జాతకంలో ఉన్న దోషాలకు అనుగుణంగా చాలా శుద్ధి పూజలు, ప్రత్యామ్నాయ వివాహాలు నిర్వహిస్తారు. సర్ప దోషం, పిశాచ దోషం, వంశపారంపర్య దోషం, మాంగల్య దోషం, కుజ దోషం వంటి అనేక దోషాల ప్రభావం తగ్గించేందుకు ఈ పూజలు చేస్తారు. అవయవ శుద్ధి, ఆత్మ శుద్ధి, శరీర శుద్ధి వంటి ప్రక్రియలు కూడా ఈ శుద్ధి వ్యవస్థల్లో భాగం.
2007లో ఐశ్వర్య రాయ్–అభిషేక్ బచ్చన్ వివాహానికి ముందు ఐశ్వర్యకు కుంభ వివాహం చేసినట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అలాగే కుజదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేశారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

మహాభారతంలో గాంధారి వివాహానికి ముందు ఆమెకు ఉన్న కుజదోష నివారణార్థం మేకతో వివాహం జరిపించారన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నా, వ్యాస మహాభారతంలో కానీ, నన్నయ్య–తిక్కన–ఎర్రన్నల రచనల్లో కానీ ఈ సంఘటన ప్రస్తావించలేదని పండితులు చెబుతున్నారు.
సమంత–రాజ్ నిడిమోరు వివాహం విషయానికొస్తే, ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహం. ఇలాంటి సందర్భాల్లో జాతక దోషాలను తొలగించేందుకు శుద్ధి క్రతువులు చేయడం భారతీయ సంప్రదాయంలో సాధారణం. వారి జాతకాల్లో ఉన్న దోషాల నివారణ కోసం లింగ భైరవి అమ్మవారి సమక్షంలో భూత శుద్ధి ప్రక్రియ జరిపి తరువాతే వివాహం నిర్వహించినట్లు సమాచారం. ఈ విధానం వల్ల భవిష్యత్తులో దోషాల ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశ్యం ఉంది.
తెలుగు ప్రజల్లో కూడా కుంభ వివాహం, అర్క వివాహం, కదళీ వివాహం, అశ్వద్ధ నారాయణ పూజ, నిలువదోపిడి వంటి పద్ధతులు జాతక దోషాలకు పరిహారంగా చాలా కాలంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో ‘నిలువదోపిడి’ సంప్రదాయం తమిళుల మధ్య ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.
పండితులు ఒకే మాట చెబుతున్నారు… సరైన గురువుల సూచనతో, సరైన ముహూర్తంలో, సరైన క్రతువులు చేస్తే వివాహం సాఫల్యంగా, శాంతియుతంగా, దోష రహితంగా సాగుతుంది.
సమంత–రాజ్ వివాహం ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చిన ఈ ఆధ్యాత్మిక పద్ధతి, ఆధునిక కాలంలో కూడా ప్రజలు సంప్రదాయాలను విశ్వసిస్తున్నారని స్పష్టంగా చూపుతుంది.
