మండాడి మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 11, 2026 by Srinivas
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా, టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ విలన్ పాత్రలో నటించిన పాన్- ఇండియా చిత్రం ‘మండాడి’. ఈ సినిమాపై సుహాస్ చాలా కాన్ఫిడెన్స్‌ను పలు సందర్భాల్లో వ్యక్తం చేశాడు. అది మాత్రమే కాకుండా సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. తమిళనాడు తీర ప్రాంతాల్లో సాంప్రదాయ బోట్ రేసింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
కళింగపట్నం అనే ఊరి కథ ఇది. సాట్టా పులి(సుహాస్).. కళింగపట్నం పోర్ట్‌కి తిరుగులేని నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. సాట్టా పులి పడవ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన తరుఫున సునామీ రైడర్స్ జట్టును బరిలో నిలిపి పడవ పోటీల్లో విజయం సాధిస్తూ ఉంటాడు. ఓ రోజు జాతరలో మల్లేష్ అనే యువకుడు సాట్టాపులి కుమారుడిపై దాడికి దిగుతాడు. కానీ సాట్టాపులి అడ్డుపడి తన కుమారుడిని తప్పించి మల్లేష్‌పై దాడికి దిగుతాడు. మల్లేష్ తప్పించుకుని హైదరాబాద్‌లోని కాళి(సూరి) వద్దకు చేరతాడు. కాళి అతన్ని కాపాడుతాడు. అయినా కూడా హైదరాబాద్‌కు సాట్టాన్ పులి మనుషులు రావడంతో రాజీ కోసం మల్లేష్‌ను తీసుకుని రాజీ కోసం కళింగ పట్నానికి వస్తాడు. పెద్దలు రాజీ కుదర్చడంతో తిరిగి ఇు జట్లు పడవ పోటీలకు దిగుతాయి. ఈ పోటీలో గెలిచినవారు కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడినవారు పోర్టును వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే ఆ పోటీకి ముందు ప్రాక్టీస్ కోసం ఓ మ్యాచ్ నిర్వహిస్తారు. దీనిలోనూ అన్యాయానికి సాట్టాపులి వర్గం దిగడంతో కాళి వర్గంలోని వారికి గాయాలవుతాయి. విషయం తెలుసుకున్న కాళి.. సాట్టాపులిపై దాడి చేస్తాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? పోటీ జరిగిందా? కాళిని ఛీ కొడుతున్న ఏంజెల్(మహిమా నంబియార్) ఎవరు? ఈ చిత్రంలో మునయ్య (సత్యరాజ్) పాత్ర ఏంటి? ప్రాణ స్నేహితులైన కాళి, సాట్టాపులి ఎలా విడిపోయి బద్ద శత్రువులుగా మారారు? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
తమిళనాడులోని రామేశ్వరం పరిసర తీర ప్రాంతాలలో పండుగల సమయంలో సంప్రదాయ తెరచాప పడవల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ పోటీల చుట్టూ ఓ కథను అల్లుకుని దర్శకుడు మతిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితులు.. వారిలో ఒకరు జెన్యూన్, మరొకరు కన్నింగ్.. ఈ నేపథ్యంలోనే ఓ ప్రేమ.. స్నేహానికి, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణలో కాళి ఇరుక్కోవడం.. వంటి సంఘటనలతో కథను దర్శకుడు అల్లారు. అయితే ఈ కథ కొత్తదేం కాదు.. గతంలో చూసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతలా అనిపిస్తుంది. అసలు కథేంటనేది ఫస్ట్ హాఫ్‌లో అర్ధం కాదు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ రివీల్ తర్వాత క్లారిటీ వస్తుంది. కళింగ, మండాడి వర్గం.. ఇవన్నీ పడవ పోటీల గురించి తెలియని మనకు కాస్త కన్ఫ్యూజింగ్‌గానే ఉంటాయి. సెకండాఫ్‌లో సముద్రంపై పడవ పోటీ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాఫీగా సాగకుండా సముద్రంలో ఒక అలజడిని సృష్టించి రక్తి కట్టించే యత్నం చేశాడు దర్శకుడు. అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయని అనిపించింది. కాస్త సముద్రంలో సుడిగుండం ఎఫెక్టే డ్రమెటిక్‌గా అనిపించింది. అయితే గాలి అనేది ముంచేయవచ్చు లేదంటే అనుకూలంగా మారి ఒడ్డున పడేయవచ్చనే లాజిక్ కూడా అందులో గ్రహించవచ్చు. అందరూ లాజికల్ థింకింగ్ చేయలేరు కాబట్టి ఆ సీన్ ఓవర్ డ్రమెటిక్ అనిపించవచ్చు. ఇక సినిమా ఓవరాల్‌గా అయితే ఇంట్రస్టింగ్‌గానే ఉంది. డ్రామా, సస్పెన్స్, ఎమోషన్ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఎలివేషన్స్ ఏమీ లేకుండా చాలా నేచురల్‌గా తీసిన విధానం బాగుంది.

ఎవరెలా నటించారంటే..
కాళి పాత్రలో సూరి అద్భుతంగా నటించాడు. తన పాత్రలో ఒదిగిపోయాడు. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక సాట్టా పులిగా సుహాస్ అయితే తన పాత్రలో జీవించేవాడు. విలన్‌గా సుహాస్‌ను గతంలోనూ మనం చూశాం కానీ ఇది వేరే లెవల్. ఏంజెల్‌గా మహిమా నంబియార్ ఫర్వాలేదనిపించింది. డీ గ్లామర్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది. ముని పాత్రలో సత్యరాజ్ అద్భుతంగా నటించారు. రవీంద్ర విజయ్ తదితరులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు మనిమారన్ అనవసర ఎలివేషన్స్ జోలికి వెళ్లకుండా చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్‌ను ఇంట్రస్టింగ్‌గా మలిచి ఉంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బీజీఎం ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో దృష్టి సారించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. సెకండాఫ్ సినిమాకు ప్రాణం పోసింది..
Rating: 



(2.5/5)
