సర్దార్ 2 మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 11, 2026 by Srinivas
కార్తి ప్రధాన పాత్రలో నటించిన ‘సర్దార్’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2022లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ‘సర్దార్’ స్థాయి విజయాన్ని ఈ చిత్రం అందుకుంటుందా? భారీ అంచనాల నడుమ వచ్చిన సీక్వెల్ అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ పంచింది?’

కథేంటంటే..
‘సర్దార్’ కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే దర్శకుడు కథను మొదలుపెట్టాడు. కార్తి ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా కనిపించారు. ఇన్‌స్పెక్టర్ నుంచి విజయ్ (కార్తి). రా ఏజెంట్‌గా మారుతారు. ఆయన రా చీఫ్ మనోజ్ బొమ్మై (ఆశిష్ విద్యార్థి)కి తెలియకుండా ఓ సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెడతాడు. రహస్య ఆపరేషన్ ఏంటంటే… భారత ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియకుండా మాజీ రా ఏజెంట్ వాల్‌రస్ (అచ్యుత్ కుమార్)ని వెతికి పట్టుకోవడం. అయితే అప్పటికే ఆ మాజీ ఏజెంట్‌ని యోగానంద్ (ఎస్‌జే సూర్య) నేతృత్వంలోని ప్రమాదకర బ్లాక్ డ్యాగర్ ముఠా వెంటాడుతుంటుంది. యోగానంద్ ముఠా దాడిలోనే వాల్‌రస్ తీవ్రంగా గాయపడి చనిపోయే ముందు విజయ్‌కి ‘మిషన్ డోకు’ అంటూ కత్తి లాంటి ఆకారంలో ఉన్న ఓ తాళాన్ని అందిస్తాడు. మరో పదిరోజుల్లో దేశంలో పెద్ద విధ్వంసం జరగనుందని విజయ్‌కు చెప్పి మరణిస్తాడు. ఆ తాళాన్ని తీసుకున్న విజయ్ డోకు ఎక్కడుందనే విషయమై అన్వేషణ మొదలు పెడతాడు. విజయ్ అన్వేషణలో ఆ డ్యాగర్‌కు 1980ల్లో తన తండ్రి ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్ (కార్తి) చేపట్టిన విఫల మిషన్ బ్లాక్ ఆపరేషన్‌కి సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అసలు ఆ బ్లాక్ ఆపరేషన్ మిషన్ లక్ష్యమేంటి? అదెందుకు ఫెయిలైంది? మిషన్ డోకుతో దేశాన్ని నాశనం చేసేందుకు బ్లాక్ డ్యాగర్ ఎలాంటి కుట్ర పన్నాడు? దానిని ఛేదించేందుకు తన కొడుకు విజయ్‌తో కలిసి సర్దార్ చేసిన సాహసాలేంటి? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..
ఈ సీక్వెల్‌లో ప్రధాన సమస్య ఏమిటంటే.. సినిమా ఆద్యంతం నమ్మశక్యం కాని విధంగా ముందుకు సాగుతుంది. కొన్ని లాజిక్ జంప్స్‌ను అంగీకరించడం చాలా కష్టం. ప్లాట్‌లోని అంశాలను సులభంగా పరిచయం చేయడం.. అంతే సులభంగా పరిష్కరించడం వంటివి చేస్తారు. దీని కారణంగానే ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఉత్కంఠ తగ్గిపోతుంది. ఒక స్పై థ్రిల్లర్‌లో హీరో పలు సందర్భాల్లో ఓడిపోవడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సినిమాలో అటువంటిది కనిపించదు. వాస్తవంగా ప్రమాదం లేకుంటే ఉత్కంఠ ఉండదు. ఉత్కంఠ లేకుంటే థ్రిల్లర్‌గా వర్కవుట్ కాదు. ‘సర్దార్’ పేరు చెప్పగానే మనకు నీటి సమస్య గుర్తొస్తుంది. ‘వన్ ఇండియా వన్ పైప్‌లైన్’ ప్రాజెక్ట్ ద్వారా తాగునీటిపై ఆధిపత్యం పొందేందుకు కొందరు చేసిన కుట్రను హీరో ఎలా చేధించాడనేది ‘సర్దార్’. ఇక ‘సర్దార్ 2’ విషయానికి వస్తే.. అంతకు మించిన ముప్పును చేధించే యత్నం. ఆ ముప్పు ఏంటంటే.. యాంటి బయాటిక్ మందుల్ని మితిమీరి వాడటం వల్ల జరగబోయే అనర్థాలు.. ఆ కారణంగా ప్రాణాలకు జరిగే ముప్పును తెలియజేశారు. అయితే సమస్య తీవ్రతను ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు మిత్రన్ ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్‌ను డోకు అనే ఓ ప్రమాదకర బయోవెపన్ చుట్టూ తిప్పి.. దాన్ని తెరవాలంటే ఓ మూడు తాళాలు అవసరమవడం.. అవి మూడు వేర్వేరు ఏజెంట్ల చేతుల్లో ఉండటం.. వాటిని వెతికి పట్టుకునేందుకు ఓవైపు హీరో, మరోవైపు బ్లాక్ డ్యాగర్ ముఠా చేసే ప్రయత్నాలను చూపించారు. సెకండాఫ్‌లో తండ్రీ కొడుకులు కలిసి ఎక్కడో కోటలో రహస్యంగా దాచి ఉంచిన ప్రమాదకర డోకు ఆయుధాన్ని బయటకు తీసుకురావడం.. దాన్ని చేజిక్కించుకుని దేశాన్ని నాశనం చేసేందుకు బ్లాక్ డ్యాగర్ సిద్ధమవడం.. వంటి అంశాలతో రూపొందించారు. ఈ సినిమాకు దర్శకత్వమే పెద్ద మైనస్. సీజీఐ వర్క్ చాలా నాసిరకంగా ఉంది. నిడివి చాలా ఎక్కువ. సినిమాలో తీసుకున్న పాయింట్స్ అన్నీ ఇంట్రస్టింగే. కానీ ప్రెజెంట్ చేయడంలోనే పూర్తిగా దర్శకుడు ఫెయిల్ అయ్యారు. కొన్ని సన్నివేశాలు మరింత సిల్లీగా ఉన్నాయి.

ఎవరెలా నటించారంటే..
ఈ సినిమాకు అతిపెద్ద, బహుశా ఏకైక బలం కార్తినే అని చెప్పాలి. రెండు పాత్రల్లోనూ లీనమై నటించారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన మెప్పించారు. ఎస్.జే. సూర్య విలన్‌గా అద్భుతంగా నటించారు. తొలి అరగంటలో ఆయన ప్రెజెన్స్ సినిమాకు మంచి ఊపును తీసుకొస్తుంది. కార్తితో తొలిసారి కలిసి నటించిన మాళవిక మోహనన్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ పాత్రలకు సైతం పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. కనిపించినంతలో బాగానే చేశారు. యోగిబాబు కామెడీ టైమింగ్‌ని ఏమాత్రం వాడలేదు. నాజర్, అచ్యుత్ కుమార్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు పీఎస్ మిత్రన్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. కానీ దాన్ని ప్రెజెంట్ చేయడంలోనే పూర్తిగా తడబడ్డారు. ఏమాత్రం సినిమా థ్రిల్లింగ్‌గా లేదు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం, విలియమ్స్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ చాలా పేలవం. కనీసం 30 నిమిషాలైనా కట్ చేయాల్సి ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్‌గా.. ఏమాత్రం థ్రిల్ పంచని ‘సర్దార్ 2’
Rating: 



(1.75/5)
