Download App
Movie Poster

Rambha Oorvasi Menaka

Cast: Allari Naresh, Surbhi, Rashi Singh, Vishnupriya, Prisha Singh, Vennela Kishore, Naresh VK, Srinivas Reddy, Racha Ravi, Muralidhar Goud

Director: Chandra Mohan Chintada

Music Director: A Chaitan Bharadwaj

Producer: Razesh Danda, Nimmakayala Prasad

Banner: Annapurna Studios, Hasya Movies

Release Date: September 4, 2026

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ

Published సెప్టెంబర్ 4, 2026 by Srinivas

అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’తో ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చాడు. ఈ సినిమాపై నరేష్‌తో పాటు మూవీ మేకర్స్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ప్రమోషన్స్‌లో కనిపించారు. అలాగే సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ చాలా హిలేరియస్‌గా ఉండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా అనుకున్న స్థాయిలో ఉందా? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

Rambha Oorvasi Menaka Review

కథేంటంటే..

మంతెన సూర్యనారాయణ (అల్లరి నరేష్)కి తల్లి కోరిక మేరకు హీరో అవ్వాలని ఆశ. వాళ్ళింట్లో సూరి చిన్నతనంలోనే ఒక పుస్తకం దొరుకుతుంది. దానిపై ముగ్గు సరిగా గీస్తే రంభ, ఊర్వశి, మేనక వచ్చి వరాలిస్తారని అతని బాబాయి (వీకే నరేష్) చెబుతాడు. అప్పటి నుంచి డైలీ పుస్తకంపై ముగ్గు గీసి రంభ ఊర్వశి మేనకలను భూమ్మీదకు రప్పించేందుకు యత్నిస్తూ ఉంటాడు. చిన్నతనంలో చిన్ని (సురభి ) కోసం జరిగిన గొడవను గుర్తు పెట్టుకుని ఎస్ఐ అప్పలస్వామి (తారక్ పొన్నప్ప) సూరిని టార్గెట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే చిన్ని ఆ ఊరికి వస్తుంది. సూరిని ప్రేమించానని తన కోసమే వచ్చినట్టు అప్పలస్వామికి చెబుతుంది. చిన్నితో పెళ్లికి సిద్ధమవుతుంది. ఈలోపే అప్పలస్వామి.. చిన్ని తండ్రి దగ్గరకు వెళ్లి సూరి అప్పుల విషయం చెబుతాడు. దీంతో చిన్ని తండ్రి సూరికి అప్పులు ఉన్నాయంటూ అబ్జెక్షన్ పెడతాడు. మరోవైపు సూరి తల్లి హాస్పిటల్ పాలవుతుంది. ఆమె ఆపరేషన్ చేస్తే కానీ బతకదని వైద్యులు చెబుతారు. ఆపరేషన్‌కు లక్షల్లో డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలోనే పుస్తకంపై ఉన్న ముగ్గును సూరి క్రాక్ చేసి.. రంభ ఊర్వశి మేనకలను భూమ్మీదకి రప్పిస్తాడు. ఆతర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? సూరి కోరికలన్నింటినీ రంభ ఊర్వశి మేనకలు తీర్చేశారా? సూరి తన తల్లిని బతికించుకోగలిగాడా? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Rambha Oorvasi Menaka Review

ఎలా ఉందంటే…

చిన్నప్పుడే కొడుకును హీరోగా చూడాలన్న తల్లి ఆశయం.. తన శక్తిని పక్కనబెట్టి తమ ఇంట తరతరాలుగా వస్తున్న ఓ పుస్తకంపై ఆధారపడటంతో సూరి దారి తప్పుతాడు. ఊరంతా అప్పులు చేస్తాడు. చివరకు తన తప్పు తెలుసుకుంటాడు. ఇలాంటి కథలు గతంలోనూ వచ్చాయి. అయితే ఇది కామెడీకి స్కోప్ ఉన్న చిత్రం. మేకర్స్ కూడా దీనిని కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించారు. అందుకు తగ్గట్టుగానే నటులను తీసుకున్నారు. కానీ కామెడీ పెద్దగా జెనరేట్ చేయించలేకపోయారు. అప్పుడెప్పుడో ‘యమలీల’ వంటి కొన్ని చిత్రాల ఛాయలు కొంతమేర కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా సూరి చిన్ననాటి నుంచే పుస్తకంపై ఆధారపడటం.. అతని కోరిక.. అప్పులు.. చిన్ని ఎంట్రీ వంటి అంశాలతో దర్శకుడు కొనసాగించాడు. సెకండాఫ్ విషయానికి వస్తే.. రంభ, ఊర్వశి, మేనక భూమి మీదకు వచ్చాక ఏం జరిగిందనే అంశాలుంటాయి. సెకండాఫ్‌లో కొంతమేర కామెడీ పర్వాలేదనిపించింది. దానినే సినిమా అంతా కొనసాగించి ఉంటే చాలా బాగుండేది. ఇక మదర్ సెంటిమెంట్ కొంతమేర పర్వాలేదనిపించింది. మొత్తంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే.

ఎవరెలా నటించారంటే..

అల్లరి నరేష్‌లో ఒకప్పటి నరేష్‌ను చూడవచ్చు. ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. సినిమా ఎలా ఉన్నా తన పాత్రలో ఆయన జీవించేశారు. హీరోయిన్ సురభి పాత్ర పరిమితమనే చెప్పాలి. పెద్దగా నటనకు స్కోప్ లేని పాత్ర. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌లు.. రంభ, ఊర్వశి, మేనకలుగా కనిపించి మెప్పించారు. ముగ్గురూ చాలా అందంగా కనిపించారు. శ్రీనివాసరెడ్డి, నరేష్ ఇద్దరూ ఈ చిత్రానికి పెద్ద అసెట్. ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్, ఎస్‌ఐగా తారక్ పొన్నప్ప చాలా బాగా నటించారు.

Rambha Oorvasi Menaka Review

టెక్నికల్ పరంగా..

సినిమా విజువల్ పరంగా చాలా బాగుంది. దర్శకుడు కామెడీపై ఫోకస్ పెట్టి ఉంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. మ్యూజిక్ పరంగా సినిమా బాగానే ఉంది. ఎడిటింగ్‌పై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా..

‘రంభ ఊర్వశి మేనక’లో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, దాన్ని పూర్తిస్థాయిలో వినోదాత్మకంగా మలచడంలో దర్శకుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అల్లరి నరేష్, శ్రీనివాసరెడ్డి, రంభ–ఊర్వశి–మేనక పాత్రల్లో నటించిన ముగ్గురు నటీనటులు తమ పరిధిలో మెప్పించినా, కథనం నెమ్మదిగా సాగడం, కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడం మైనస్‌గా మారాయి. సెకండాఫ్‌లో అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలు, మదర్ సెంటిమెంట్ కొంత ఆకట్టుకుంటాయి. కాన్సెప్ట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించినా.. పూర్తి స్థాయి కామెడీ కోసం ఆశించే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నిరాశ కలిగించే అవకాశముంది.

Rating: (2.25/5)

మరిన్ని వార్తలు

No categories found.